మహారాష్ట్ర : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాపై సంచలన వ్యాఖ్యలు చేశారు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) అధ్యక్షుడు అభిజిత్ దీప్కే. జూలై 20న విద్యార్థులపై బలప్రయోగం చేయాలని షా ఆదేశించారని ఆరోపించారు. అందుకే నైతిక బాధ్యత వహిస్తూ తక్షణమే తన పదవికి రాజీనామా చేసి, తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఆయనను విచిత్రమైన వ్యక్తిగా అభివర్ణించారు. పార్లమెంట్ మార్చ్ సందర్భంగా విద్యార్థులపై బలప్రయోగం చేయాలనే ఆదేశాలు కేంద్ర హోం మంత్రి అమిత్ షా నుండే వచ్చి ఉంటాయని అభిజీత్ దిప్కే షాకింగ్ కామెంట్స్ చేయడం కలకలం రేపింది. పోలీసుల అణిచివేత చర్యకు బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మధ్య మహారాష్ట్రలోని తన స్వస్థలమైన ఛత్రపతి సంభాజీనగర్‌లో గురువారం విలేకరులతో మాట్లాడారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని, రాజకీయ పార్టీలను విచ్ఛిన్నం చేయడానికి కేంద్ర దర్యాప్తు సంస్థలను వాడుకుంటున్నారని, అలాగే న్యాయ వ్యవస్థపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం అనేది ఇప్పుడు కేవలం ప్రతిపక్షానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు. దేశ ప్రజలందరూ ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు అభిజిత్ దీప్కే. నీట్ పరీక్షా పత్రం లీక్ వ్యవహారంపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ ఆధ్వర్యంలో నెల రోజులకు పైగా సాగిన నిరసన ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. న్యాయవ్యవస్థపై కూడా ప్రశ్నార్థకం నెలకొంది. శివసేన, ఎన్సీపీ వంటి పార్టీలను విచ్ఛిన్నం చేయడానికి ఈడీ , సీబీఐ లను ఎలా ఉపయోగించారో మనమందరం చూశామన్నారు. ప్రజాస్వామ్యాన్ని సజీవంగా ఉంచడం , ఒక వ్యక్తి నియంతృత్వాన్ని సృష్టించకుండా చూడటం దేశంలోని పెద్ద సంస్థల బాధ్యత అని స్పష్టం చేశారు.
దేశ విద్యాశాఖ మంత్రి అత్యాచారాలకు పాల్పడిన వారిని ప్రశంసిస్తే, ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించి మరో వింత మనిషిని తీసుకువచ్చారన్నమాట. దేశానికి ఎలాంటి సందేశం వెళ్తోంది? వారి పార్టీ గూండాలతో నిండి ఉన్నందున వారు ఇంకేమీ చేయలేరని సంచలన ఆరోపణలు చేశారు అభిజిత్ దిప్కే. వారి హయాంలో రామ్ రహీం (అత్యాచార దోషి) వంటి వారు పెరోల్‌పై బయటకు వస్తున్నారు. ఈ ప్రభుత్వం గూండాలకు, అత్యాచారాలకు పాల్పడిన వారికి మద్దతు ఇస్తోందంటూ ధ్వజమెత్తారు. తన పతంజలి ఆయుర్వేద్ కంపెనీ వ్యాపారాన్ని చూసుకోవాలని రాం దేవ్ బాబాకు సలహా ఇచ్చారు. నీట్ పేపర్ లీక్‌పై తమ సంస్థ చేపట్టిన నిరసన రాజ్యాంగ బద్ధమైనదేనని సీజేపీ వ్యవస్థాపకుడు నొక్కి చెప్పారు.
















