హైదరాబాద్ : తెలంగాణలో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. మొదటి రోజున ఉత్తర జిల్లాల్లో తీవ్రమైన వర్షాలతో పాటు గంటకు 50 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని, అలాగే రాబోయే ఐదు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. 30న భారీ నుండి అత్యంత భారీ వర్షాలు, 31న కూడా వర్షాలు కొనసాగుతాయని హెచ్చరికలు జారీ చేసింది. చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందిని పేర్కొంది. ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ , జగిత్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో గంటకు 40–50 కి.మీ వేగంతో బలమైన గాలులతో కూడిన భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది ఐఎండి.
నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు , కామారెడ్డి జిల్లాల్లో కూడా ఇదే విధమైన గాలుల వేగంతో భారీ నుండి చాలా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మెదక్, సంగారెడ్డి, జనగాం, హనుమకొండ, మహబూబాబాద్, వరంగల్, వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, సిద్దిపేట , భద్రాద్రి కొత్తగూడెం వంటి అనేక ఇతర జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. మిగిలిన జిల్లాల్లో గంటకు 30–40 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. రెండవ రోజున వర్షాల తీవ్రత కొద్దిగా తగ్గే అవకాశం ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురవవచ్చు. ఆదిలాబాద్, నిర్మల్ , నిజామాబాద్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.















