హైదరాబాద్ : ‘భవ్య’ (BHAVYA – India Industrial Development Scheme) పథకంలో భాగంగా రాష్ట్రంలో 4 పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు వెల్లడించారు. ఏర్పాటు చేయనున్న పారిశ్రామిక పార్కుల పురోగతిపై డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ప్రధాన కార్యదర్శి సంబంధిత ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అహ్మద్ నదీమ్, పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్య, చేనేత, పరిశ్రమల శాఖ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి, సిక్తా పట్నాయక్ , ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ‘భవ్య’ పథకం మొదటి దశలో భాగంగా రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న 4 పారిశ్రామిక పార్కులకు సంబంధించిన పూర్తి ప్రాజెక్ట్ నివేదికను ఈ నెలాఖరు నాటికి కేంద్రానికి సమర్పిస్తామని తెలిపారు.
ప్రతి పార్కు 500 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉంటుందని, దీనికి సంబంధించిన భూసేకరణ, ఇతర ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని ఆయన పేర్కొన్నారు. కందుకూరు మండలంలోని తిమ్మాపూర్, ఇబ్రహీంపట్నంలోని ఎలిమినేడు, ఘట్‌కేసర్ మండలంలోని మదారం , చౌటుప్పల్ మండలంలోని దండు మైలారం ప్రాంతాలు ఇందులో ఉన్నాయని సీఎస్ వెల్లడించారు. ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్‌వేర్ , ఇతర రంగాలకు సంబంధించిన పరిశ్రమలను ఈ పార్కులలో ఏర్పాటు చేయడానికి అనేక ప్రముఖ కంపెనీలు ముందుకు వచ్చాయని ఆయన చెప్పారు. అదనంగా, మరో 16 ప్రాంతాలలో పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు సీఎస్ వివరించారు.


















