హైదరాబాద్ : శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అజయ్ కేఆర్ సమర్పణలో కాశి విశాలాక్షి బలుసు నిర్మాణంలో ఎంఎస్ రాజు తెరకెక్కించిన చిత్రం ‘అగధ’. ఈ మూవీలో కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్‌కుమార్, భాను చందర్, సిజ్జు, వనిత విజయ్‌కుమార్, రోషన్ బషీర్, శ్రేయా రాణి రెడ్డి, వివా రాఘవ, రాబర్ట్ మాస్టర్, ఆర్నా ములేర్, కనకవ్వ ముఖ్య పాత్రలను పోషించారు. ఈ సినిమాను ఆగస్ట్ 14న భారీ ఎత్తున విడుదల చేబోతున్నారు. ఈ మూవీకి సంబంధించిన టీజర్ ఆల్రెడీ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా నిలిచింది. తాజాగా ‘ది ఆరిజిన్ ఆఫ్ అగధ’ అంటూ చిత్రం గురించి ఎన్నో విశేషాల్ని పంచుకున్నారు.
ఈ సందర్బంగా ఎంఎస్ రాజు మాట్లాడారు. ‘ఇప్పటికి నేను ఎన్ని సినిమాలు నిర్మించినా, దర్శకుడిగా చేసినా సాలిడ్‌గా సిమెంట్ ఫ్లోర్ మీద నిల్చున్నట్టు ఉండదు.. ప్రతీ ఫిల్మ్ ఒక కొత్త అనుభవం.. ప్రతీదీ ఒక ఛాలెంజ్. నా కెరీర్‌లో ‘దేవి’, ‘మనసంతా నువ్వే’, ‘ఒక్కడు’, ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ వంటి చిత్రాలన్నీ కథగా, స్క్రీన్ ప్లే పరంగా నాకు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. ఇప్పుడు మళ్లీ ‘అగధ’కి అలాంటి ఛాలెంజ్‌లే ఎదురయ్యాయి. ఈ కథను అనుకున్నప్పుడే ఇలాంటి ఛాలెంజ్‌లు, ఇలాంటి యుద్ధం ఉంటుందని అనుకున్నాను. ఆడియెన్స్ ఇది వరకు ఎప్పుడూ చూడని ఎపిసోడ్స్ ఉండాలని నిర్ణయించుకున్నాను. ఎన్నో రాష్ట్రాలు తిరిగాను.. ఈ మూఢ నమ్మకాలు, అలాంటి గ్రామాలు, ప్రజల్ని సందర్శించాను. ఒక ఇంటికి వెళ్లాను. అక్కడ ఒకామె దెయ్యాల్ని వదిలిస్తూ కనిపించారు.ఆ పాత్రని నేను తీసుకున్నాను. ఆ కారెక్టర్‌కి మహాదేవి అని పేరు పెట్టాను.
ఈ కారెక్టర్‌కి ధీటుగానే సింహ పాత్ర కూడా ఉంటుంది. ఆ పాత్ర కోసం చాలా మందిని అనుకున్నాను. శ్రవణ్ రెడ్డిలో నాకు సింహ కనిపించాడు. ఇలాంటి ఓ మూవీని చేయాలంటే మంచి ప్రొడక్షన్ కావాలి. శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ బ్యానర్, కాశి విశాలాక్షి గారు నాకెంతో సపోర్ట్ చేశారు. వారి సహకారం వల్లే నేను పూర్తిగా సినిమా మీద ఫోకస్ పెట్టగలిగాను. ఉల్కా అనే పాత్రను ముంబై నుంచి వచ్చిన నటి చేశారు. జోవిక, షిజు అద్భుతంగా నటించారు. నాని కెమెరా వర్క్ అద్భుతంగా ఉంటుంది. కథకి, స్క్రీన్ ప్లే కోసం చాలా రీసెర్చ్ చేశాం. సినిమాని ఓన్ చేసుకుని నటించే ఆర్టిస్టులు కావాలని అనుకున్నాను. నాకు అద్భుతమైన ఆర్టిస్టులు దొరికారు. చైతన్య స్క్రిప్ట్ వర్క్‌లో, అడిషనల్ స్క్రీన్ ప్లేలో సహాయం చేశాడు. నాకు వచ్చిన డ్రీమ్ ఏంటో.. ఆగస్ట్ 14న ప్రేక్షకులందరికీ తెలుస్తుంది’ అని అన్నారు.



















