Pawan Kalyan : అమరావతి – ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మృతి పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సంతాపం వ్యక్తం చేశారు. విలక్షణమైన నటనకు చిరునామాగా నిలిచారని , ఆయన ఇక లేరని తెలుసుకుని దిగ్భ్రాంతికి లోనయ్యానని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని అన్నారు. కోట శ్రీనివాసరావు తెలుగు తెరపై ప్రతినాయకుడిగా, క్వారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్నమైన పాత్రలు పోషించారని ప్రశంసించారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు తీరని లోటు కోట మరణమన్నారు పవన్ కళ్యాణ్ కొణిదల.
Pawan Kalyan Comments on Kota Srinivasa Rao Death
ఇదిలా ఉండగా కోట శ్రీనివాస రావు సినీ ప్రస్థానం చిరంజీవి నటించిన ప్రాణం ఖరీదుతో ప్రారంభమైంది. ఆయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా. విలన్ గా, కమెడియన్, తండ్రిగా, తాతగా, రాజకీయ నాయకుడిగా, పిసినారిగా, పోలీసుగా ఇలా అద్భుతమైన పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి దాదాపు 750కి పైగా సినిమాల్లో నటించి తనదైన ముద్ర వేసుకున్నారు. ఎస్వీ రంగారావు, కైకాల సత్యనారాయణ, రావు గోపాలరావుల శకం తర్వాత ఆ లోటును భర్తీ చేశారు.
నటనా పరంగా తెలుగునాట చెరిగిపోని ముద్ర వేశారు కోట శ్రీనివాసరావు. ఆయన నటన చిరస్మ రణీయం..అజరామరం. సినీ కళామతల్లి ఉన్నంత వరకు తను వెలుగుతూనే ఉంటారు. ఓవైపు నటుడిగా ఇంకో వైపు రాజకీయ నాయకుడిగా ఉన్నా తనకంటూ ఓ ప్రత్యేకతను నిలబెట్టుకున్నారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలలో ముఖ్య భూమిక పోషించారు. తనకు ఎదురే లేదని చాటారు కోట శ్రీనివాసరావు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవార్డులు, పురస్కారాలు అందుకున్నారు.
తెలుగు చలనచిత్ర రంగంలో ప్రముఖ నటుడిగా, తెలుగు రాజకీయాల్లో అజాత శత్రువుగా రాణించారు కోట శ్రీనివాసరావు. తమిళం, కన్నడం, హిందీ, మళయాలం తదితర భాషల్లో నటించి నాలుగు దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీలో పోషించిన ప్రతి పాత్రకు న్యాయం చేశారు.
Also Read : Brahmanandam – Kota Death : ‘కోట’ మరణం బ్రహ్మానందం భావోద్వేగం



















