అమరావతి : యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని, ఉన్నత విద్య పూర్తికాగానే స్థానికంగానే ఉద్యోగాలు లభించేలా రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమలు నెలకొల్పుతున్నామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. విద్యతోనే అభివృద్ధి సాధ్యమని నమ్మిన వ్యక్తి సీఎం చంద్రబాబు అని, విద్యార్థుల డ్రాపౌట్ల నివారణే లక్ష్యంగా పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ (పీటీఎం)తో విద్యార్థుల పురోగతి మరింత మెరుగు పడుతుందన్నారు. నర్సాపూర్ నియోజక వర్గం స్టేషన్ పేటలో ఉన్న మహాత్మాజ్యోతిరావు పూలే బాలుర గురుకుల పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా పీటీఎం కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బొమ్మడి నారాయణ నాయకర్ తో ఆమె పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో విద్యాభివృద్దికి సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు మంత్రి ఎస్. సవిత.
అన్న ఎన్టీఆర్ గురుకుల విద్యను ప్రారంభిస్తే, సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అత్యధిక గురుకుల పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటయ్యాయన్నారు. 2014-19 మధ్య సీఎం చంద్రబాబు నాయుడు 75 బీసీ గురుకులాలను ఏర్పాటు చేస్తే, కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలో 12 ఎంజేపీ గురుకులాలను స్థాపించారన్నారు. బీసీ బిడ్డలు ఉన్నత విద్యలు చదవాలన్నదే ఆయన లక్ష్యమన్నారు. దీనిలో భాగంగా ఈ ఏడాది విద్యా సంవత్సరంలో కొత్తగా పది బీసీ గురుకులాలను ప్రారంభించారన్నారు. ఆరు బాలిక బీసీ గురుకుల పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా అభివృద్ధి చేశారన్నారు ఎస్. సవిత. బీసీ గురుకులాల్లో చదవే విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు రుచికరమైన, పౌష్టికాహారం అందిస్తున్నామన్నారు. బీసీ గురుకులాలు, హాస్టళ్లలో సీసీ కెమెరాలు, ఆర్వో ప్లాంట్లు, ఇన్వర్టర్లు ఏర్పాటు చేశామన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా, డ్రాపౌట్ల నివారణకు పలు సంక్షేమ పథకాలను సీఎం చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నారన్నారు. తల్లికి వందనం, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా మిత్ర కిట్లు అందజేస్తున్నారన్నారు. మధ్యాహ్న భోజనంలో సన్న బియ్యంతో రుచికరమైన భోజనం అందిస్తున్నామన్నారు. బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలన్నదే సీఎం లక్ష్యమని మంత్రి సవిత తెలిపారు.

















