ముంబై : నటి సాయి పల్లవి ఎంపికపై అనుమానాలు కాదు, ఆమెకు గౌరవం దక్కాలని అన్నారు నిర్మాత హేమంత్ మధుకర్. దక్షిణాదిలో అత్యుత్తమ నటీమణులలో ఒకరైన సాయి పల్లవి అపారమైన ప్రతిభను ప్రశ్నించడం దురదృష్టకరమని చిత్ర నిర్మాత పేర్కొన్నారు. నితీష్ తివారీ దర్శకత్వంలో రాబోయే ‘రామాయణం’ చిత్రంలో సీత పాత్రకు సాయి పల్లవి ఎంపికపై చర్చ మళ్లీ మొదలైంద. సీనియర్ బాలీవుడ్ నటుడు అన్నూ కపూర్ ఈ పాత్రకు ఆమె సరైన ఎంపిక అవునా కాదా అని ప్రశ్నించడంతో ఈ వివాదం తలెత్తింది. రామానంద్ సాగర్ ‘రామాయణం’ స్థాయిలోనే ఈ చిత్రం సాంకేతికంగా అద్భుత దృశ్య కావ్యంగా నిలవగలదని కపూర్ అభిప్రాయప డినప్పటికీ, కోట్లాది మంది హిందువులు ‘తల్లి’గా ఆరాధించే సీత పాత్రను సాయి పల్లవి పోషించడంపై మాత్రం సందేహాలు వ్యక్తం చేశారు.
తనకు దర్శకుడు నితీష్ తివారీ వ్యక్తిగతంగా తెలియదని చెప్పినప్పటికీ, తన ప్రధాన ఆందోళన మాత్రం చిత్రంలో నటీనటుల ఎంపిక గురించేనని ఆయన స్పష్టం చేశారు. సాయి పల్లవికి గట్టి మద్దతుగా నిలిచిన చిత్ర నిర్మాత హేమంత్ మధుకర్, ఈ విమర్శలను దురదృష్టకరం అని పేర్కొన్నారు. తెలుగు, తమిళం , మలయాళ చిత్ర పరిశ్రమలలో ఆమె తన ప్రతిభను పదేపదే నిరూపించుకున్నారని ఆయన గుర్తుచేశారు. సాయి పల్లవి అపారమైన ప్రతిభను ప్రశ్నించడం దురదృష్టకరం. ఆమె దక్షిణాదిలో అత్యుత్తమ నటీమణులలో ఒకరు. ఇంతటి ప్రతిష్టాత్మకమైన బాలీవుడ్ ఇతిహాస చిత్రంలో నటించే అవకాశం దక్కించు కున్నందుకు ఆమెకు పూర్తి గౌరవం దక్కాలి అని ఆయన అన్నారు.
సీత పాత్ర ఎంపికలో కేవలం శారీరక రూపురేఖలే ప్రామాణికం కావాలన్న వాదనను కూడా హేమంత్ తోసిపుచ్చారు. కేవలం తెల్లని ఛాయ కలిగిన నటి మాత్రమే సీత పాత్రను పోషించాలనేది సరైన వాదన కాదు. ఆ పాత్రకు ఎవరు సరిపోతారో నిర్ణయించే విషయంలో దర్శకుడు నితీష్ తివారీ సరైన వ్యక్తి, ఆయన సరైన నిర్ణయమే తీసుకున్నారని నేను భావిస్తున్నాను. సాయి పల్లవి ఈ పాత్రను అద్భుతంగా పోషిస్తారు, ఎందుకంటే ఇది నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్ర; ముఖ్యంగా సీతను అశోక వనానికి తీసుకెళ్లిన తర్వాత వచ్చే సన్నివేశాల్లో ఇది స్పష్టమవుతుంది. దీనికి భావోద్వేగ లోతు అవసరం, అటువంటి పాత్రకు న్యాయం చేయగల నటీమణులు చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు అని ఆయన జోడించారు.



















