న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనకు ప్రముఖ పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్ చుక్ మద్దతు తెలిపారు. ఆయన గత 20 రోజులుగా నిరాహార దీక్షకు దిగారు. రోజు రోజుకు ఆరోగ్యం క్షీణిస్తోంది. ఇందుకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు వెంటనే వాంగ్ చుక్ కు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని, మెరుగైన వైద్య సాయం చేయాలని ఆదేశించింది.
ఇదిలా ఉండగా సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష 20వ రోజుకు చేరుకుంది, ఇది ఆయన ఆరోగ్యం పట్ల తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఆయన పరిస్థితి విషమంగా మారిందని, దీక్షను కొనసాగిస్తే కీలక అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉందని చికిత్స చేస్తున్న వైద్యులు హెచ్చరించారు. ఈ నిరసన సమయంలో వాంగ్‌చుక్ గణనీయంగా బరువు తగ్గినట్లు సమాచారం; ఆయన కేవలం నీరు . అవసరమైన లవణాలపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఆరోగ్యం క్షీణిస్తున్నప్పటికీ, పార్లమెంటుకు ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించిన జూలై 20 వరకు తన నిరాహార దీక్షను కొనసాగిస్తానని ఆయన స్పష్టం చేశారు. కాగా ఒకవేళ ఆయన పరిస్థితి మరింత క్షీణిస్తే తక్షణమే వైద్య సహాయం అందించాలని అధికారులకు సూచించింది కోర్టు.
అనేకమంది రాజకీయ నాయకులు , ప్రముఖులు వాంగ్‌చుక్ ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ, దీక్షను విరమించాలని ఆయనను కోరారు. అయితే, తన డిమాండ్లకు తగిన గుర్తింపు లభించాలనే ఉద్దేశంతో వాంగ్‌చుక్ తన నిరసనను కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నారు.నిరాహార దీక్ష కొనసాగుతుండటంతో, రాబోయే రోజుల్లో చోటుచేసుకోబోయే పరిణామాలపై అందరి దృష్టి నెలకొంది. వైద్యులు ఆయన పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తుండగా, ఆరోగ్యం మరింత క్షీణించక ముందే సమస్యకు శాంతియుత పరిష్కారం లభిస్తుందని ఆయన మద్దతుదారులు ఆశిస్తున్నారు.

















