ఖాదీ, గ్రామీణ పరిశ్రమల మండలి ద్వారా రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (PMEGP) పథకం కింద 2024-25లో 974 యూనిట్లు స్థాపించి, రూ.38.51 కోట్ల మార్జిన్ మనీ అందజేసి, 10,714 మందికి ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. 2025-26లో 2,319 యూనిట్ల ఏర్పాటుకు నిర్ణయించామని, వాటికి రూ.70.15 కోట్ల మార్జిన్ మనీ మంజూరు చేశామని తెలిపారు. ఈ యూనిట్ల స్థాపన ద్వారా 25,509 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని చెప్పారు ఎస్. సవిత. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల ద్వారా 463 మంది యువతకు, మహిళలకు టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, మగ్గం వర్క్, కాగితం తయారీ, కొవ్వొత్తుల తయారీ తదితర ఉపాధి ఆధారిత కోర్సుల్లో శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామని మంత్రి చెప్పారు.
2014-19 చేనేత రంగానికి సర్ణ యుగమని, ఆనాటి టీడీపీ ప్రభుత్వం నేతన్నల మేలు కోసం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని సవిత తెలిపారు. తరవాత వచ్చిన వైసీపీ ప్రభుత్వంలో అన్ని రంగాల మాదిరిగానే చేనేత రంగానికి తీవ్రనష్టం కలిగిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో, నేతన్నలు ఊపిరిపీల్చుకోగలిగారని సవిత తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత, జౌళి శాఖ ముఖ్య ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా, ఖాదీ, గ్రామీణ పరిశ్రమల మండలి సీఈవో సింహాచలం, కమిషనర్ రేఖారాణి, లేపాక్షి ఎండీ విశ్వ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
















