తిరుపతి : తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు జూన్ 25 నుండి 29వ తేదీ వరకు ఐదు రోజులపాటు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ప్రతిరోజూ సాయంత్రం 6.30 గంటల నుండి రాత్రి 7.30 గంటల వరకు పద్మసరోవరంలో సుందరంగా అలంకరించిన తెప్పలపై విహరిస్తూ శ్రీ అలమేలుమంగ తల్లి భక్తులకు దివ్య దర్శనం ఇవ్వనున్నారు. పాంచరాత్ర ఆగమ సంప్రదాయాల ప్రకారం నిర్వహించే ఈ మహోత్సవాల్లో పద్మసరోవర తీరాన అమ్మవారు విశేష పూజలను అందుకుని భక్తజనులను కటాక్షించనున్నారు. జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు జరిగే ఈ తెప్పోత్సవాల్లో పాల్గొనడం ద్వారా భక్తుల కష్టాలు, సంసార బంధనలు తొలగి దైవానుగ్రహం, సర్వసౌఖ్యాలు సిద్ధిస్తాయని పురాణ ప్రాశస్త్యం.
పద్మసరస్సులోని బంగారు పద్మం నుండి ఆవిర్భవించిన శ్రీ పద్మావతి అమ్మవారు జగజ్జననిగా భక్తులను భవసాగరంలో మునిగి పోకుండా రక్షించి మోక్షమార్గాన్ని ప్రసాదిస్తారనే ఆధ్యాత్మిక సందేశాన్ని తెప్పోత్సవాలు చాటి చెబుతాయి. ఉత్సవాలను పురస్కరించుకుని భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ 25న రుక్మిణి, సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామివారి తెప్పోత్సవం, 26న శ్రీ సుందరరాజస్వామివారి తెప్పోత్సవం, 27 నుండి 29 వరకు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవం నిర్వహించనున్నారు .చివరి మూడు రోజుల పాటు పద్మ సరోవరంలోని నీరాడ మండపంలో మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4.30 గంటల వరకు అమ్మ వారికి స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు.అలాగే జూన్ 28వ తేదీ రాత్రి 8.30 గంటలకు గజవాహన సేవ, 29వ తేదీ రాత్రి 8.30 గంటలకు గరుడవాహన సేవ వైభవంగా జరుగనున్నాయి. తెప్పోత్సవం అనంతరం ప్రతిరోజూ ఆలయ మాడవీధుల్లో అమ్మవారి ఉత్సవమూర్తుల ఊరేగింపు నిర్వహించనున్నారు.



















