హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ ) కీలక ప్రకటన చేసింది. ఆదివారం సంస్థ తరపున మేనేజింగ్ డైరెక్టర్ వై. నాగిరెడ్డి తీపి కబురు చెప్పారు. వేసవి సెలవులు నేటితో ముగియనున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 15 సోమవారం నుంచి ప్రభుత్వ ఆధీనంలోని బడులు , గురుకుల, సంక్షేమ, కేజీబీవీ పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు మేలు చేకూర్చేలా ఆర్టీసీ సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా బస్సులు నడపనున్నట్లు ప్రకటించారు ఎండీ. అదికారికంగా ఎండీ పేరుతో ఓ ప్రకటన విడుదలైంది. విద్యార్థుల సురక్షిత ప్రయాణానికి టీజీఎస్ ఆర్టీసీ సిద్ధంగా ఉందని వెల్లడించారు. విద్యార్థుల వేళలకు అనుగుణంగా అన్ని రూట్లలో ఆర్టీసీ బస్సులు నడపాలని ఇప్పటికే ఆయా డిపోల మేనేజర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 2026-27 విద్యా సంవత్సరానికి గాను పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు గాను సమయానికి అనుకూలంగా బస్సులు నడిపేందుకు సిద్దం చేశామని తెలిపారు ఎండీ. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి రవాణా ఇబ్బందులు కలగకుండా అన్ని రూట్లలో తగినన్ని స్కూల్ బస్సులను నడపాలని టీజీఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వై.నాగిరెడ్డి అన్ని రీజియన్ ల అధికారులను ఆదేశించారు. నూతన విద్యా సంవత్సరంలో మొత్తం 227 పని దినాలు ఉన్నందున, విద్యార్థులు సకాలంలో సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకునేలా రవాణా సౌకర్యాలను సిద్ధం చేశామని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రంలోని అన్ని రీజియన్ల అధికారులు, డిపో మేనేజర్లు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండి రవాణా ఏర్పాట్లను పర్యవేక్షించాలని ఎండీ సూచించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థుల స్కూల్ టైమింగ్స్‌కు అనుగుణంగా బస్సు సర్వీసులను క్రమబద్ధీకరించాలని, గతంలో నడిపిన అన్ని స్కూల్ రూట్లను విధిగా పునరుద్ధరించాలని స్పష్టం చేశారు. విద్యార్థులు బస్సుల కోసం ఎక్కువ సమయం వేచి ఉండకుండా, ఉదయం , సాయంత్రం వేళల్లో ఖచ్చితమైన సమయ పాలన పాటించాలని, అవసరమైన చోట అదనపు ట్రిప్పులు నడపాలని క్షేత్రస్థాయి సిబ్బందిని ఎండీ ఆదేశించారు.
















