హైదరాబాద్ : తెలంగాణ రైతు కమిషన్ చైర్మన్, మజీ ఎమ్మెల్యే ఎం. కోదండ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. వైఎస్ హయాంలో ఉచిత కరెంట్ , రుణమాఫీ చేయడం విప్లవం అని పేర్కొన్నారు. అదే తరహాలో సీఎం రేవంత్ రెడ్డి 2 లక్షల రుణమాఫీ చేసి రైతు డిస్కం తీసుకు రావడం చరిత్రలో మిగిలి పోతుందన్నారు. మోటర్లకు మీటర్లు పెట్టే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి లేనే లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రైతు బిడ్డా అని కొనియాడారు. గత ప్రభుత్వంలో అడ్డగోలు నిర్ణయాలు తీసుకొన్న వారు ఇప్పుడు మాట్లాడుతుండడం దారుణమన్నారు.
రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వాలి. కానీ రైతుకు ఎకరాకు 3 గంటల కరెంట్ సరి పోతుందని చెప్పాననని అన్నారు కోదండరెడ్డి. ఒకటి రెండు పత్రికలు కావాలనే వక్రీకరించి రాశారని ఆరోపించారు రైతు కమిషన్ చైర్మన్. నేను కూడా రైతునేనని, తనకు వ్యవసాయం అంటే ఏమిటో, అది సాగు చేస్తే ఎన్ని కష్టాలు ఉంటాయో అనుభవ పూర్వకంగా తెలుసు అన్నారు. అందుకే కూలంకుశంగా సర్కార్ కు రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించడం జరిగిందన్నారు. కొందరు నేతలు పనిగట్టుకుని మాట్లాడుతున్నారని వారి పేర్ల గురించి బయటకు చెప్పాల్సిన పని లేదన్నారు ఎం. కోదండరెడ్డి. తమ ప్రభుత్వం అన్నం పెట్టే అన్నదాతలకు ఇబ్బందులు కలిగించేలా ఎలాంటి పనులు చేపట్టదని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు చైర్మన్.



















