అమరావతి : ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత సంచలన ప్రకటన చేశారు. కూటమి ప్రభుత్వం బీసీ హాస్టళ్లు, గురుకులాల నిర్వహణకు అధిక ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. బీసీ విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఆహారంతో పాటు ఆరోగ్య రక్షణకు పెద్దపీట వేస్తోందన్నారు. దీనిలో భాగంగా త్వరలో 1,291 పారిశుధ్య సిబ్బందిని నియమించనున్నట్లు తెలిపారు. ఈ నియామకాలకు సంబంధించిన ప్రక్రియను ఇప్పటిరకే చేపట్టామన్నారు. హాస్టళ్లు, గురుకులా పరిసరాలను నిరంతరం పరిశుభ్రంగా ఉంచాలన్నారు. తద్వారా విద్యార్థుల ఆరోగ్య రక్షణకు వీలు కలుగుతుందన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా హాస్టళ్లు, గురుకులాలకు వచ్చే విద్యార్థులకు తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేశారు. బయట ఆహారం లోపలికి తీసుకు రావొద్దని, దీనివల్ల విద్యార్థుల ఆరోగ్యం చెడిపోయే ప్రమాదం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులకు తెలపాలని మంత్రి సవిత సూచించారు.
ప్రభుత్వమందించే మెనూ సక్రమంగా అమలు చేయడంతో పాటు రుచికరమైన భోజనం అందించడానికి 142 కుక్, కమాటీ పోస్టులు త్వరలో భర్తీ చేయనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. ఖాళీలు, ఆయా హాస్టళ్లలో ఖాళీలను బట్టి కుక్ లు, కమాటీలను నియమిస్తామన్నారు. 224 మంది సచివాలయాల సిబ్బందిని డిప్యూటేషన్ పై బీసీ హాస్టళ్లలో తీసుకోనున్నట్లు వెల్లడించారు వారిలో 126 మంది వీఆర్వోలను, 98 మంది మహిళా పోలీసులు ఉన్నారన్నారు. వారికి హాస్టళ్ల నిర్వహణ, ఇతర అంశాలపై రెండ్రోజుల పాటు శిక్షణ కూడా ఇవ్వనున్నామన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థల హాస్టళ్లకు ధీటుగా బీసీ విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించేలా హాస్టళ్లను, గురుకులాలను సిద్ధం చేస్తున్నట్లు మంత్రి సవిత తెలిపారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద కిచెన్ గార్డెన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
















