అమరావతి : యువతలో, మహిళల్లో, విద్యార్థుల్లో యోగా పట్ల ఆసక్తి పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాం అన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. స్వర్ణాంధ్ర-2047 విజన్‌లో భాగంగా యోగాను ప్రజారోగ్య ఉద్యమంగా తీర్చిదిద్దుతున్నాం అన్నారు. రాష్ట్రంలో 10 లక్షల మంది సర్టిఫైడ్ యోగా సాధకులను తయారు చేస్తాం అని ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న ట్రైనర్ల సంఖ్యను 2.50 లక్షలకు పెంచేందుకు కార్యాచరణ చేపట్టడం జరిగిందన్నారు. యోగాంధ్ర-2026 విజయవంతం కోసం రూ.10 కోట్ల ప్రత్యేక బడ్జెట్ కేటాయించాం అని తెలిపారు . జిల్లా స్థాయి మౌలిక సదుపాయాలు, ప్రచారం, నిర్వహణ ఏర్పాట్లకు ఈ నిధులు వినియోగించనున్నట్లు వెల్లడించారు. అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేశాం. యోగాను ఒక్కరోజు కార్యక్రమంగా పరిమితం చేయకుండా 365 రోజుల ఉద్యమంగా కొనసాగిస్తాం అన్నారు సీఎం.
రాష్ట్రంలో ఒక కోటి మంది క్రమం తప్పకుండా యోగా చేసేలా చర్యలు తీసుకుంటాం. ఏపీ యోగా ప్రచార పరిషత్, సంజీవని యాప్, హ్యాబిల్డ్ వాట్సాప్ కమ్యూనిటీల ద్వారా నిరంతర శిక్షణ చేపడుతున్నాం. జూన్ నెల మొత్తాన్ని ‘యోగా నెల’గా ప్రకటించాం. దీనిని సక్సెస్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు సాయం తీసుకుంటున్నాం. ప్రతి ఇంటికి యోగా చేరేలా మంతెన సత్యనారాయణ రాజు ప్రత్యేక వీడియోలు రూపొందించారు. సాధారణ యోగా ఆసనాలు, వ్యాధి నివారణ, రోజువారీ సాధన, యోగా సందేహాలకు సమాధానాలు వంటి అంశాలపై 168కు పైగా వీడియోలు అందుబాటులో ఉన్నాయి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, టీవీ ఛానళ్లు, కేబుల్ నెట్‌వర్క్స్ ఉచితంగా ప్రజలకు చేరువ చేయాలని పిలుపునిచ్చారు.
వాట్సాప్ నంబర్ 81424 04888కు ‘Hi’ అని మెసేజ్ పంపిస్తే యోగా వీడియోలు వస్తాయి. స్కూళ్లు, కాలేజీల్లో యోగాను చదువులో భాగం చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. చిన్న వయస్సు నుంచే యోగా అలవాటు చేయగలిగితే ఆరోగ్యవంతమైన తరాన్ని తీర్చిదిద్దగలం. యోగాంధ్ర-2026 కోసం యోగాంధ్ర పోర్టల్‌ను ప్రారంభించాం. yogandhra.ap.gov.in ద్వారా కార్యక్రమాల వివరాలు, వీడియోలు, నమోదు ప్రక్రియ తదితర సమాచారం అందుబాటులో ఉంటుంది. మహిళలు, విద్యార్ధుల్లో యోగాపై ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని సంజీవని ప్రాజెక్టుకు కూడా లింక్ చేసేలా చర్యలు చేపడుతున్నాం. ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఇషా ఫౌండేషన్ సద్గురు జగ్గీ వాసుదేవ్, బ్రహ్మకుమారీస్, దాజీ, బాబా రామ్ దేవ్ లాంటి విశిష్ట వ్యక్తుల భాగస్వామ్యం తీసుకుంటున్నాం అని చెప్పారు.
ప్రకృతి ఆశ్రమం నిర్వహిస్తున్న మంతెన సత్యనారాయణ రాజు సేవలు కూడా వినియోగించుకుని యోగాను ఇంటిగ్రేట్ చేస్తాం. మీడియా, సామాజిక మాధ్యమాల ద్వారా ఈ యోగా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లేలా కార్యాచరణ చేపడుతున్నాం. గత ఏడాది యోగాంధ్ర కార్యక్రమంతో దేశం, ప్రపంచం మొత్తం మన వైపు చూసేలా చేశాం. విశాఖలో ప్రధాని మోదీ సమక్షంలో నిర్వహించిన యోగాంధ్రతో రికార్డులు సృష్టించాం. గతేడాది 2.44 కోట్ల మంది యోగాంధ్ర కార్యక్రమానికి పేర్లు నమోదు చేసుకున్నారు. 1.91 కోట్ల మందికి సర్టిఫికెట్లు అందించాం. 1.33 లక్షల వేదికలపై 1.53 లక్షల మంది ట్రైనర్లతో నిర్వహించాం. 2.18 కోట్ల మంది వెల్‌నెస్ సెంటర్లు, ఆయుష్ కేంద్రాల ద్వారా క్రమం తప్పకుండా యోగా చేస్తున్నారు. రెండు రాష్ట్రాల్లోని తెలుగు వారు ఉపయోగించుకునేలా యోగాంధ్ర పోర్టల్ ఏర్పాటు చేస్తున్నాం. నాణ్యమైన జీవనానికి యోగా మనకు వారసత్వంగా అందిన ఓ అమూల్యమైన సంపద… దానిని అంతా అందిపుచ్చుకోవాలి. ఏపీలో చేస్తున్న ప్రకృతి సేద్యానికి అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చింది… ఈ విజ్ఞానాన్ని మనం ప్రపంచానికి అందించేలా చర్యలు చేపడుతున్నాం అని సీఎం చంద్రబాబు చెప్పారు.
















