అమరావతి : అమరావతి రాజధానికి మొదట అనుకూలమని చెప్పి అధికారంలోకి రాగానే గొడ్డలి వేటు వేసిన నీచ చరిత్ర జగన్మోహన్ రెడ్డిదని బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత ధ్వజమెత్తారు. నాడు అక్రమ కేసులతో అమరావతి రైతులను ఇబ్బంది పెట్టిన జగన్.. నేడు ముసలి కన్నీరు కారుస్తున్నాడని ఆరోపించారు. జగన్ డైవర్ట్ పాలిటిక్స్ కోసం అమరావతి రైతులను వాడుకోవడం చాలా బాధాకరమని పేర్కొన్నారు. సూర్య చంద్రులు ఉన్నంత కాలం అమరావతి రైతుల త్యాగాలను రాష్ట్ర ప్రజలు మరిచి పోరని కొనియాడారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ లో పాల్గొనడానికి వచ్చిన మంత్రి సవిత తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర భవిష్యత్ ఆలోచించి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు అమరావతి ప్రాంత రైతులు సుమారు 34వే ల ఎకరాలు ఇచ్చారన్నారు. రూపాయి ఖర్చు లేకుండా విజయవంతంగా ల్యాండ్ పూలింగ్ చేసిన ఘనత చంద్రబాబు నాయుడిదేనన్నారు.
యువత భవిష్యత్ దృష్ట్యా అమరావతి నిర్మాణం ప్రారంభిస్తే.. జగన్మోహన్ రెడ్డి అధికారం అడ్డం పెట్టుకుని మూడు ముక్కలాట ఆడి రాజధాని ప్రాజెక్టు అటకెక్కించాడని మండిపడ్డారు ఎస్. సవిత. జగన్ లాంటి వ్యక్తులకు భయపడే అమరావతికి చట్టబద్ధత హోదా తీసుకొచ్చామని, అయినప్పటికీ రాజధానిపై తన అక్కసును వెళ్లగక్కుతూనే ఉన్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. గతంలో అనంతపురంలో కియా పరిశ్రమ రాకుండా అడ్డుకోవాలని చూశారని అన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు, ఉద్యోగాలు, పెట్టుబడులు రాకుండా చేయాలని జగన్మోహన్ రెడ్డి కుట్ర పన్నుతున్నారని తీవ్రంగా మండిపడ్డారు. జగన్ ఫ్యామిలీ ఉండటానికి మాత్రం వందల ఎకరాల్లో భవనాలు నిర్మించుకోవచ్చు…అయిదు కోట్ల ఆంధ్రులకు మాత్రం రాజధాని వద్దంటూ వితండవాదం చేస్తున్నాడని మంత్రి సవిత మండిపడ్డారు. జగన్, ఆయన భార్య, ఇద్దరు పిల్లలు ఉండటానికి రుషికొండలో రూ.500 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేశారన్నారు. కానీ రాజధాని నిర్మాణానికి అసలు ఖర్చు ఎందుకని ప్రభుత్వంపై పడి ఏడుస్తున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు.















