తిరుమల : హైదరాబాద్ హిమయత్‌నగర్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయం 21వ వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలు, గోడ పత్రికలను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆవిష్కరించారు. హైదరాబాద్‌లోని ఛైర్మన్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. జూన్ 19 నుండి 24 వరకు బ్రహ్మోత్సవ మహోత్సవాలు అంకురార్పణతో ప్రారంభం – ధ్వజావరోహణంతో ముగుస్తాయని తెలిపారు.
జూన్ 19వ తేదీ సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. జూన్ 20న కర్కాటక లగ్నంలో ధ్వజారోహణం నిర్వహించి ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లు, తాగునీటి సదుపాయం, విద్యుద్దీపాల అలంకరణలు ఏర్పాటు చేయాలని ఛైర్మన్ సూచించారు. 20వ తేదీన ఉదయం శేష వాహనం, రాత్రి హనుమంత వాహనం, 21న ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం, 22న ఉదయం గజ వాహనం, ఉదయం శాంతి కల్యాణం, రాత్రి గరుడ వాహనం, 23న ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వ వాహనం, చక్రస్నానం – పుష్పయాగంతో ఆధ్యాత్మిక పరవశం ఉంటుందన్నారు. జూన్ 24న ఉదయం స్నపన తిరుమంజనం, చక్రస్నానం నిర్వహించనున్నారు. సాయంత్రం పుష్పయాగం, రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు సంపూర్ణం కానున్నాయి.
బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అన్నప్రసాద వితరణ జరగనుండగా, భక్తులను అలరించే ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో ఎల్.ఏ.సీ. అధ్యక్షులు శంకర్ గౌడ్, టెంపుల్ ఏఈవో యు. రమేష్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ మణికంఠ, వేద పారాయణదారులు, అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.


















