తిరుపతి : తిరుపతి శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయంలో జూన్ నెలలో పలు విశేష ఆర్జిత, మాసోత్సవాలు భక్తి వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలను పొందాలని ఆలయ అధికారులు కోరారు . జూన్ 6, 13, 20, 27 తేదీలలో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీ సీతా రామలక్ష్మణుల మూలవర్లకు పవిత్ర అభిషేకం నిర్వహిస్తారు. జూన్ 15న అమావాస్య సందర్భంగా ఉదయం 8.30 గంటలకు సహస్ర కలశాభిషేకం నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటలకు శ్రీరామచంద్రునికి పరమభక్తుడైన ఆంజనేయస్వామి సేవను స్మరింపజేసే హనుమంత వాహనసేవ వైభవంగా జరుగనుంది.
జూన్ 17న పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని ఉదయం 11 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 5.30 గంటలకు స్వామి, అమ్మవార్లను తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడవీధుల గుండా శ్రీరామచంద్ర పుష్కరిణి వరకు ఊరేగింపుగా తీసుకు వెళతారు. సాయంత్రం 6.30 గంటలకు ఊంజల్‌సేవ నిర్వహించనున్నారు.
జూన్ 29న పౌర్ణమి సందర్భంగా ఉదయం 9.30 గంటలకు అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు తిరుచ్చి ఉత్సవం ఆలయ నాలుగు మాడవీధుల గుండా శ్రీరామచంద్ర పుష్కరిణి వరకు సాగుతుంది. అనంతరం సాయంత్రం 6.30 గంటలకు ఆస్థానం నిర్వహించనున్నారు.
భక్తులు ఈ విశేష ఉత్సవాలలో పాల్గొని శ్రీ సీతా రామచంద్రుల అనుగ్రహాన్ని పొందాలని ఆలయ అధికారులు కోరారు.


















