చెన్నై : డీఎంకే సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్తాయిలో మండిపడ్డారు. మిత్ర ద్రోహానికి పాల్పడిందని ఆరోపించారు. పవర్ కోసం ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ తమను వెన్నుపోటు పొడిచిందని, ఇక నుంచి ఆ పార్టీని నమ్మబోమని ప్రకటించారు . చెన్నై వేదికగా ఆదివారం జరిగిన డీఎంకే యువజన విభాగం సమావేశంలో ఉదయనిధి స్టాలిన్ పాల్గొని ప్రసంగించారు. బీజేపీ వరుసగా జాతీయ స్థాయిలో విజయాలు సాధించడానికి ఆ కాషాయ పార్టీ అగ్ర నాయకత్వం కంటే కాంగ్రెస్ పార్టీయే పూర్తి బాధ్యత వహించాలని ఆయన ఆరోపించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమిని సమీక్షించేందుకు చెన్నైలోని ‘అన్నా అరివాలయంకు వచ్చారు.
గతంలో తమ మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్, ఎన్నికల ప్రయోజనాలను పూర్తిగా పొందిన తర్వాత వెన్నుపోటు పొడిచిందన్నారు. గత 20 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ మా భుజాలపై ఎక్కి ప్రయాణించిందని అన్నారు. కానీ ఈ రోజు, వారు మాకు వెన్నుపోటు పొడిచారు. ఈ విషయాన్ని ఎవరూ ఎప్పటికీ మర్చి పోకూడదని అన్నారు. భవిష్యత్తులో ఏ సందర్భంలోనూ మనం కాంగ్రెస్‌ను నమ్మకూడదు అని హెచ్చరించారు పార్టీ క్యాడర్ కు. అలాగే వారిని మళ్ళీ మన దరిదాపుల్లోకి కూడా రానివ్వకూడదని పిలుపునిచ్చారు ఉదయనిధి స్టాలిన్. బీజేపీ విజయాలకు ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీయేనని ఇప్పుడు అర్థం అవుతోందన్నారు. ఇప్పుడు ఆ విషయం స్పష్టంగా కనిపిస్తోంది అని ఆయన గట్టిగా నొక్కి చెప్పారు. గత సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికలలో కూటమి పట్ల డీఎంకే సంపూర్ణ నిబద్ధతను విమర్శించారు. కాంగ్రెస్ అభ్యర్థుల విజయాన్ని నిర్ధారించడానికి, ప్రధానంగా లౌకికవాదాన్ని పరిరక్షించడానికి, బీజేపీని తమిళనాడుకు దూరంగా ఉంచడానికి డీఎంకే కార్యకర్తలు ఎలా రక్తపు చెమట చిందించారో ఉదయనిధి హైలైట్ చేశారు.
ఈ ఎన్నికలలో కూడా, వాస్తవంగా ఉనికిలో లేని కాంగ్రెస్ కేవలం మా నాయకుడి ఆదేశాలు , డీఎంకే కార్యకర్తల అవిశ్రాంత కృషి వల్ల ఐదు సీట్లు గెలుచుకో గలిగిందన్నారు. కానీ గెలిచిన వెంటనే, కనీసం మర్యాద పూర్వక సమాచారం కూడా ఇవ్వకుండా అధికారం కోసం పారిపోయారంటూ ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌కు ప్రాథమిక కృతజ్ఞత, రాజకీయ సభ్యత కొరవడిందని ఆయన అన్నారు. డీఎంకే వారికి గుణపాఠం నేర్పక పోయినా, తమిళనాడు ప్రజలు త్వరలోనే ఆ పని చేస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఇటీవలి ఎన్నికల పరాజయాల నేపథ్యంలో అంతర్గత పార్టీ వ్యూహంపై దృష్టి సారిస్తూ, ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం మాని, సమగ్రంగా దిద్దుబాటు చర్యలు చేపట్టాలని డీఎంకే నాయకుడు కోరారు. పార్టీ సోషల్ మీడియా వ్యూహంలోని లోపాలను, ఇంటింటి స్థాయిలో ఓటర్లను రాజకీయంగా ఆకట్టుకోవడంలో విఫలమవ్వడాన్ని ఆయన ప్రత్యేకంగా ఎత్తి చూపారు.
















