హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ వరుస దాడులతో హోరెత్తిస్తోంది. దీంతో అవినీతి, అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. మొన్న వాటర్ వర్క్స్ శాఖలో జనరల్ మేనేజర్ కుమార్ నివాసంపై సోదాలు చేపట్టింది. విస్తు పోయేలా భారీ ఎత్తున ఆస్తుల చిట్టా బయట పడింది. లెక్కకు మించి ఆభరణాలు, నోట్ల కట్టలు బయట పడ్డాయి. తన అక్రమ ఆస్తులు దాదాపు రూ. 100 కోట్లకు పైగా వుంటుందని ఏసీబీ అంచనా వేసింది. అది మరిచిపోక ముందే రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది సికింద్రాబాద్ లోని బోయున్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా పని చేస్తున్న మహిళ మహిత. తను రూ. 30 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడింది.
తాజాగా మరో అవినీతి తిమింగలం ఏసీబీకి చిక్కింది. ఒకప్పుడు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు అంటే గౌరవం ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. మేడ్చల్-రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్ నివాసంలో ఏసీబీ దాడులు చేపట్టింది. వందల కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు గుర్తించింది. ప్రభుత్వ భూములను తన మామయ్య పేరుతో రిజిస్టర్ చేయించి, వాటిని రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అప్పగించారంటూ ఆరోపణలు ఉన్నాయి. అబ్దుల్లాపూర్‌మెట్ , పిగ్లిపురం ప్రాంతాల్లోని 8 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి, రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అప్పగించాడు. గతంలో శేరిలింగంపల్లి , ఇతర ప్రాంతాల్లో RDOగా పని చేశాడు వంశీ మోహన్. అక్కడ కూడా భారీ ఎత్తున ఆస్తులు పోగేసినట్లు సమాచారం.

















