హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్ట బోతున్న ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుపై మాజీ మంత్రి, బీఆర్ ఎస్ నేత హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు సరైంది కాదని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య పేర్కొన్నారు. రాబోయే ప్రభుత్వం బీఆర్ ఎస్ అనీ, తాము అధికారంలోకి రాగానే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని మాజీ మంత్రి అనడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. హరీష్ రావు వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. ఫ్యూచర్ సిటీలో జర్నలిస్టులకు ఇళ్ళస్థలాలు కేటాయించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాన్ని తాము స్వాగతిస్తున్నామని అన్నారు. అయితే ఈ ప్రయత్నాన్ని అడ్డుకోవడం కోసమే హరీష్ రావు కుట్రపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్టులకు గత పదేళ్ళలో టీఆర్ ఎస్, బీఆర్ ఎస్ ప్రభుత్వం చేయలేని పని కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం చేస్తున్నారని మామిడి సోమయ్య అన్నారు. జర్నలిస్టులకు, సివిల్ సర్వీసెస్ అధికారులకు, ప్రజా ప్రతినిధులకు ఫ్యూచర్ సిటీలో 500 ఎకరాల భూమి కేటాయిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించిన ప్రస్తుత సమయంలో మాజీ మంత్రి హరీష్ రావు ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం పాత్రికేయుల్లో ఆవేదన, ఆందోళన వ్యక్తమవుతుందని ఆయన పేర్కొన్నారు. తమ రాజకీయ కక్షలు, స్వార్ధ ప్రయోజనాల కోసం ప్రతిపక్ష నేతలు ప్రజల అభివృద్ధిని, సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకోవడం సరైంది కాదని అన్నారు. జర్నలిస్టులకు ఇళ్ళస్థలాలు కేటాయించబోయే ఫ్యూచర్ సిటీకి అడ్డు పడడం బీఆర్ ఎస్ పార్టీ చేయబోయే పెద్ద తప్పిదమని అన్నారు. తొమ్మిదిన్నరేళ్ళు అధికారంలో ఉండి జర్నలిస్టులకు ఏమీ చేయని ప్రతిపక్ష బీఆర్ ఎస్ నాయకులు జర్నలిస్టుల సంక్షేమానికి అడ్డు రావడం సరైంది కాదని అన్నారు.
















