చెన్నై : తమిళనాడు శాసన సభకు నూతన స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు జేసీడీ ప్రభాకర్. ఆయనతో పాటు డిప్యూటీ స్పీకర్ గా రవిశంకర్ కూడా ఎన్నికయ్యారు. ఆయనను ప్రతిపాదించారు సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. సభ్యులంతా ముక్తకంఠంతో మద్దతు పలికారు. ఈ సందర్బంగా సభను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు స్పీకర్ గా ఎన్నికైన ప్రభాకర్. సీఎం విజయ్ ను ఆకాశానికి ఎత్తేశారు. ఆయనను దివంగత ఎంజీఆర్ తో పోల్చారు. ఆయన అడుగు జాడల్లో సీఎం నడుస్తున్నారంటూ కితాబు ఇచ్చారు. తనను ప్రతిపాదించడం, ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా చేయడం పట్ల ధన్యవాదాలు తెలిపారు స్పీకర్.
తమిళనాడు అసెంబ్లీ నూతన స్పీకర్ తమిళగ వెట్రి కజగం సాధించిన విజయాన్ని కొనియాడారు. అలాగే ముఖ్యమంత్రి విజయ్ ప్రజాదరణను, ప్రజలపై ఆయనకున్న ప్రభావాన్ని మాజీ ముఖ్యమంత్రి M.G. రామచంద్రన్ తో పోల్చుతూ ఆయనను ప్రశంసించారు. అంతకు ముందు, ప్రభాకర్ తమిళనాడు అసెంబ్లీ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ ఎన్నిక కోసం అసెంబ్లీ సమావేశమైనప్పుడు, తాత్కాలిక స్పీకర్ ఎంవీ కరుప్పయ్య మాట్లాడుతూ… ప్రభాకర్ అభ్యర్థిత్వాన్ని ముఖ్యమంత్రి. జోసెఫ్ విజయ్ ప్రతిపాదించారని ప్రకటించారు. స్పీకర్ పదవికి కేవలం ఆయన నామినేషన్ మాత్రమే దాఖలు కావడంతో, ఏకగ్రీవంగా, ఏకపక్షంగా ఎన్నికైనట్లు ప్రకటించారు.
ఈ సందర్బంగా సీఎం జోసెఫ్ విజయ్ ప్రసంగించారు. నూతనంగా ఎన్నికైన స్పీకర్ ప్రభాకర్, డిప్యూటీ స్పీకర్ రవిశంకర్ లను అభినందించారు. భారత రాజ్యాంగం ఇచ్చిన స్పూర్తితో మనందరం ఇక్కడ ఉన్నామన్నారు. అన్ని పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలంతా సమానమేనని ప్రకటించారు.
















