చెన్నై : తమిళనాడులో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఎలాంటి ఆరోపణలు, విమర్శలకు తావీయకుండా కేవలం ప్రజలను కేంద్రంగా చేసుకుని పాలనపై ముద్ర వేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు టీవీకే పార్టీ చీఫ్ , సీఎం జోసెఫ్ చంద్రశేఖర్ విజయ్. ఇప్పటికే పలు పార్టీలు సర్కార్ ఏర్పాటుకు మద్దతు ప్రకటించాయి. ఈ తరుణంలో సంచలన ప్రకటన చేశారు ప్రత్యర్థి పార్టీ అయిన ఏఐడీఎంకేకు చెందిన సీనియర్ నాయకుడు , ఎమ్మెల్యే షణ్ముగం. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తన నేతృత్వంలోని వర్గమే నిజమైన పార్టీ అని పేర్కొన్నారు. ఈ సందర్బగా బేషరతుగా తమ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలంతా టీవీకే విజయ్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.
తాజాగా షణ్ముగం చేసిన ప్రకటన ఇటు తమిళనాడుతో పాటు దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఇదిలా ఉండగా టీవీకే విజయ్ సర్కార్ ఏర్పాటు చేసేకంటే ముందు ఏఐడీఎంకే డీఎంకే పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేశాయంటూ సంచలన ఆరోపణలు చేశారు. అందుకే తాము ఆ చర్చలను, ప్రయత్నాలను , నిర్ణయాన్ని వ్యతిరేకించామని చెప్పారు. ఇందులో భాగంగానే విజయ్ పార్టీకి సపోర్టుగా ఉండాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అంతే కాకుండా భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో పార్టీ ఎటువంటి పొత్తు లేకుండానే స్వతంత్రంగా పోటీ చేస్తుందని ప్రకటించారు. మాజీ మంత్రి S.P. వేలుమణి ఏఐడీఎంకే శాసనసభాపక్ష నాయకుడిగా వ్యవహరిస్తారని, సి. విజయ భాస్కర్‌ను పార్టీ విప్‌గా నియమించామని కూడా ఆయన ప్రకటించారు.

















