హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం తీసుకు రానున్న మహిళ బిల్లులో ఓబీసీ మహిళలకు వాటా బీసీ వర్గాల నేతలు ఆమరణ దీక్షకు పూనుకున్నారు. బీసీ మహిళా జేఏసీ ఛైర్మన్ మట్టా జయంతి గౌడ్ ఆధ్వర్యంలో హిమాయత్ నగర్ లోని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా జయంతి మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజునే ఆమరణ నిరాహార దీక్ష పూనుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. కేంద్రంపై ఒత్తిడి పెంచేలా ఢిల్లీ వేదికగా పలుమార్లు ధర్నాలు చేపట్టినట్టు ఆమె తెలిపారు. కాగా, కేంద్రం నుండి ఎలాంటి స్పందన లేక పోవడంతో ఆమరణ నిరాహార దీక్ష చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు జయంతి వెల్లడించారు.
బీసీ మహిళలకు ఉప కోటా కల్పించక పోవడం అంటే మెజారిటీ ప్రజలను మోసం చేయటమే అని ఆమె అభిప్రాయపడ్డారు. బీసీ మహిళలకు సబ్ కోటా ఇవ్వకుండా మహిళా రిజర్వేషన్లు వచ్చినా… ఆయా వర్గాల ఆడబిడ్డలకు చట్టసభల్లో అడుగు పెట్టే అవకాశం దక్కదని జయంతి ఆందోళన వ్యక్తం చేశారు. సామాజికంగా వెనుకబడిన వర్గాలకు ప్రాతినిధ్యం లేని మహిళా రిజర్వేషన్ల బిల్లు అసంపూర్ణమేనని పేర్కొన్నారు. అన్ని వర్గాలకు మేలు చేసినప్పుడే అసలైన సామాజిక న్యాయం. మహిళా రిజర్వేషన్ల బిల్లులో ఓబీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించే వరకు నా దీక్ష కొనసాగుతుందని ప్రరకటించారు.
















