అమరావతి : కూటమి ప్రభుత్వం ఏర్పడిన కేవలం 22 నెలల కాలంలోనే ఏపీకి రూ.25 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయన్నారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజక వర్గాల్లోనూ ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ పార్కుల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసే పెట్టుబడి దారులకు ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందజేస్తోందన్నారు. తక్షణ అనుమతులకు చర్యలు తీసుకుంటోందన్నారు ఎస్ సవిత. ఎంఎస్ఎంఈ పార్కుల్లో చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చే ఈడబ్ల్యూఎస్ సామాజిక వర్గీయులకు బీసీ సంక్షేమ శాఖ ద్వారా అండగా నిలుస్తామన్నారు. ఆసక్తి కలిగిన యువత డీపీఆర్ లతో ముందుకొస్తే, చిన్న,మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు సబ్సిడీ రుణాలు, ఉత్పత్తులపై అవగాహన కల్పిస్తామని మంత్రి సవిత తెలిపారు.
ప్రతి ఇంటి నుంచి ఒకరిని పారిశ్రామిక వేత్తగా తీర్చిదిద్దాలన్నది సీఎం చంద్రబాబు లక్ష్యమని మంత్రి సవిత తెలిపారు. ఇందులో భాగంగా నిర్వహిస్తున్న ఒక రోజు సదస్సును ఈడబ్ల్యూఎస్ సామాజిక వర్గానికి చెందిన యువత, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. యువతే భారత దేశ బలమని, వారి చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఉందని అన్నారు. అందుకే సీఎం చంద్రబాబు అన్నింటా యువతకు ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు ఎస్. సవిత. కూటమి ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకుని పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ ల కంటే పారిశ్రామికవేత్తలుగా తోటి నిరుద్యోగులకు ఉపాధి కల్పించే అవకాశం కలుగుతుందన్నారు.

















