హైదరాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు క్రీడా రంగంపై. క్రీడారంగంలో హైదరాబాద్‌ను దేశానికి ఒక రోల్ మాడల్‌గా తీర్చిదిద్దాలని, అందుకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. గచ్చీబౌలి స్టేడియాన్ని ప్రపంచంలో ఒక అత్యుత్తమ క్రీడా వేదికగా తీర్చిదిద్దాలన్నదే తన లక్ష్యమని స్పష్టం చేశారు. క్రీడా ప్రాంగణాన్ని అభివృద్ధి చేయడానికి సంబంధించి కార్యాచరణపై ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో స్పోర్ట్స్ హబ్ చైర్మన్ సంజీవ్ గోయెంకా, కో చైర్మన్ ఉపాసన కొణిదల, కావ్య మారన్, శశి ధర్, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ అవతరణ దినోత్సవం జూన్ 2వ తేదీన గచ్చిబౌలి స్టేడియం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తామని అన్నారు సీఎం. ఆ లోగా పూర్తిస్థాయి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. ఆ స్టేడియంలో హెలిప్యాడ్‌తో పాటు ప్రపంచస్థాయి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. క్రీడాకారులు విమానాశ్రయం నుంచి నేరుగా హెలికాప్టర్‌లో స్టేడియంకు చేరుకునేలా ఏర్పాటు ఉండాలన్నారు. స్టేడియంకు భవిష్యత్తులో కూడా ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు. ఇప్పటికే ఆర్కిటెక్ట్‌ను నియమించామని తెలిపారు.
స్టేడియం అభివృద్ధి విషయంలో బోర్డుకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామన్నారు సీఎం. దీర్ఘకాలంలో తెలంగాణలో క్రీడల అభివృద్ధి మా లక్ష్యం అని, రాబోయే ఒలింపిక్ క్రీడలు కూడా హైదరాబాద్‌లో నిర్వహించే స్థాయిలో సదుపాయాలు ఉండాలని పేర్కొన్నారు . చైనాలో క్రీడా సౌకర్యాలను మించిన సదుపాయాలు కల్పించాలని పేర్కొన్నారు. లక్షల సంఖ్యలో ఉన్న ఐటీ, ఇతర ఉద్యోగులను ఆకర్షించడానికి పెద్ద పెద్ద స్క్రీన్లను ఏర్పాటు చేయాలని సూచించారు.



















