అమరావతి : ఏపీ బీసీ, సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి సర్కార్ వచ్చాక నేతన్నల బతుకుల్లో వెలుగులు నింపామన్నారు. గత ప్రభుత్వ తీరు వల్ల ఆప్కో నష్టాల్లో కూరుకు పోయిందన్నారు. ఆప్కో పేరుతో కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.120 కోట్లను గత ప్రభుత్వం తీసుకొచ్చి, పక్కదారి పట్టించిందని ఆరోపించారు. దీనివల్ల ఆప్కో సంస్థ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకు పోయిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరవాత ఆప్కోను గాడిలో పెడుతున్నాం అన్నారు. చేనేత సహకార సంఘాల బకాయిలను చెల్లిస్తున్నామని చెప్పారు. చేనేత వస్త్రాలపై ఆప్కో, చేనేత సంఘాలకు జీఎస్టీ మినహాయింపు చేయాలనే ప్రతిపాదనను పరిశీలిస్తున్నాం అని తెలిపారు ఎఎస్. సవిత. చేనేత వస్త్రాల అమ్మకాలు పెంచేలా ప్రత్యేక ఎగ్జిబిషన్లు నిర్వహించి 40 శాతం, 50 శాతం డిస్కౌంట్లలో చేనేత ఉత్పత్తులు విక్రయిస్తున్నాం అని తెలిపారు.
కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఆప్కో షో రూమ్ ల్లో అమ్మకాలు పెరిగాయని చెప్పారు మంత్రి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి, మంత్రి నారా లోకేష్, ఆయన సతీమణి నారా బ్రాహ్మణి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేనేత వస్త్రాలను ధరిస్తూ కళాకారులను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. ప్రతి పండుగకు, వారానికోసారి రాష్ట్ర ప్రజలందరూ చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి కళాకారులకు తోడ్పడాలని పిలుపునిచ్చామని, దీని కారణంగా ఆప్కో అమ్మకాలు గణనీయంగా పెరిగాయన్నారు. ఉచిత విద్యుత్ నేతన్నలకు మరింత ఆర్థిక దన్ను లభించనుందన్నారు. మా కూటమి ప్రభుత్వ లక్ష్యం ఒక్కటే.. చేనేత కుటుంబాలు గౌరవమైన, ఆర్థిక భరోసాతో కూడిన జీవనం సాగించడం. ఇందుకోసం ఎన్ని కోట్లయినా వెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాం అన్నారు.

















