నంద్యాల జిల్లా : శ్రీశైలం దేవస్థానం వద్ద ఉగాది సందర్భంగా లక్షలాది మంది భక్తులు తరలి వస్తారని, ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం వారి ఆత్మవిశ్వాసానికి నిదర్శనమని అన్నారు జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ రహత్కర్. శక్తిపీఠం, జ్యోతిర్లింగం ఒకేచోట ఉండటం “శివ-శక్తి ఏకరూపం”కు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. మహిళలపై నేరాల్లో 4.4 శాతం తగ్గుదల నమోదవడం సానుకూల పరిణామమని తెలిపారు. ‘శక్తి టీమ్’, ‘స్త్రీ శక్తి’ పథకాలు ద్వారా మహిళలకు భద్రత, సౌకర్యాలు కల్పిస్తున్నట్లు వివరించారు. ఉచిత బస్సు ప్రయాణం ద్వారా కోట్లాది ప్రయాణాలను సులభతరం చేసినట్లు పేర్కొన్నారు. ‘ఆపరేషన్ TRACE’ ద్వారా వేలాది అదృశ్య మహిళలు, బాలికలను గుర్తించినట్లు చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో గర్భిణీల కోసం 35 బర్త్ వెయిటింగ్ రూమ్‌ల నిర్మాణం, మహిళల ఉపాధి కోసం “వర్క్ ఫ్రం హోమ్” పథకం అమలు వంటి చర్యలను వివరించారు.
మహిళలు, బాలికలు అదృశ్యమవుతున్న కేసులు, సోషల్ మీడియాలో అసభ్య వ్యాఖ్యలు, ఏజెన్సీ ప్రాంతాల్లో బాల్య గర్భధారణలు పెరుగుతున్న అంశాలు ఆందోళనకరమని పేర్కొన్నారు. ఇటువంటి ఘటనలు సమాజానికి హెచ్చరికగా పరిగణించాలని సూచించారు. మహిళా భద్రత, సంక్షేమ పథకాల సమర్థ అమలుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు కమిషన్ చైర్ పర్సన్. ఆంగన్‌వాడీ, ఆరోగ్య, విద్యా శాఖల సమన్వయంతో బాలికల ఆరోగ్యం, పోషణపై దృష్టి సారించాలని తెలిపారు. స్వయం సహాయక సంఘాల ప్రోత్సాహం, బాల్య వివాహాలు, గర్భధారణ నివారణపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. వన్ స్టాప్ సెంటర్, 181 హెల్ప్‌లైన్ సేవలను మరింత బలోపేతం చేయాలని చైర్ పర్సన్ ఆదేశించారు.
















