హైదరాబాద్ : తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా హైదరాబాద్‌లోని సోమాజిగూడలోని లోక్‌భవన్‌లో జరిగిన ఉగాది పూర్వ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రముఖ అతిథులు, ఆహ్వానితులు, లోక్‌భవన్ కుటుంబ సభ్యులు, కళాకారులను ఉద్దేశించి ప్రసంగించారు .పరాభవ నామ సంవత్సరానికి నాంది పలికే ఉగాది పండుగ సందర్భంగా గవర్నర్ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే సంవత్సరంలో ప్రతి ఇంట్లో శ్రేయస్సు, మంచి ఆరోగ్యం, ఆనందం వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు.
60 ఏళ్ల చక్రంలో పరాభవ సంవత్సరం ప్రాముఖ్యతను వివరిస్తూ, ఇది అహం, ప్రతికూల ఆలోచనలను అధిగమించి, విజయం, అభివృద్ధికి పునాది వేయడానికి ప్రతీక అని గవర్నర్ అన్నారు. ఈ నూతన సంవత్సరం అందరికీ పురోగతి, అభివృద్ధిని తీసుకు వస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
ఉగాది ఒక నూతన ఆరంభానికి ప్రతీక అని, ఆరు రుచులతో కూడిన సాంప్రదాయ ఉగాది పచ్చడి జీవితంలోని సుఖసక్తుల సమ్మేళనాన్ని ప్రతిబింబిస్తుందని ఆయన నొక్కిచెప్పారు. గతానుభవాల నుండి గుణపాఠం నేర్చుకుని, అంకితభావంతో, సేవాభావంతో ముందుకు సాగాలని గవర్నర్ ప్రజలకు పిలుపునిచ్చారు.
సమృద్ధిగా వర్షాలు కురవాలని, వ్యవసాయ శ్రేయస్సు చేకూరాలని ఆశాభావం వ్యక్తం చేస్తూ, తెలంగాణ, దేశం నిరంతరం అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. మరోసారి ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ, “జై తెలంగాణ”, “జై హింద్” నినాదాలు చేస్తూ గవర్నర్ తన ప్రసంగాన్ని ముగించారు.



















