శ్రీశైలం : శ్రీశైలం మహా పుణ్య క్షేత్రంలో నిర్వహించనున్న మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలను భక్తుల మనోభావాలకు అనుగుణంగా, భక్తి పారవశ్యంతో సజావుగా నిర్వహించాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా చేపట్టాలని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. శ్రీశైలంలోని సదాశివయ్య భవన్‌లో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బి.సి. జనార్ధన్ రెడ్డ సమీక్ష చేపట్టారు.
ఈ సమావేశంలో దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, ఎక్స్-ఆఫిషియో ప్రిన్సిపల్ సెక్రటరీ హరి జవహర్ లాల్, జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, ఎస్పీ సునీల్ షొరాణ్ హాజరయ్యారు. ఈ సమీక్ష సమావేశంలో శ్రీశైలం దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు, ట్రస్ట్ బోర్డు చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, శ్రీశైలం, ఆత్మకూరు డీఎఫ్‌వోలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడారు. మహాశివరాత్రి పర్వదిన వేడుకల సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ నిర్వహణ, దర్శన ఏర్పాట్లు, వసతి, భద్రత, పారిశుద్ధ్యం వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులకు సూచించారు. గత సంవత్సరం ఎదురైన లోపాలను సవరించడంతో పాటు, సంభవించే సమస్యలను ముందుగానే అంచనా వేసి పరిష్కార మార్గాలు సిద్ధంగా ఉంచుకోవాలని స్పష్టం చేశారు.



















