TTD : తిరుమలలో భక్తులకు అందే అన్నప్రసాద సేవలో టీటీడీ మరొక కొత్త సేవను ప్రారంభించింది. ఇప్పటి వరకు మధ్యాహ్న భోజన సమయంలో మాత్రమే అందించిన వడలు, ఇప్పుడు సాయంత్రం భోజనంలోనూ అందుబాటులోకి వచ్చాయి. జూలై 7వ తేదీ నుంచి రాత్రి పూట వడల పంపిణీ ప్రారంభమైందని టీటీడీ (TTD) అధికారులు తెలిపారు.
TTD Annaprasadam Updates
మార్చి 6వ తేదీ నుంచి రోజుకు సుమారు 30,000 నుండి 35,000 వడలు మధ్యాహ్న భోజనంలో వడ్డిస్తుండగా, తాజా నిర్ణయం మేరకు సాయంత్రం భోజనానికి కూడా 35,000 వడలు అందించనున్నారు. ఈ విధంగా ప్రతి రోజు 70,000 నుండి 75,000 వడలు అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు ఉచితంగా పంపిణీ చేయబడుతున్నాయి.
ఈ సేవను టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు స్వయంగా ప్రారంభించారు. అన్నప్రసాద భవనంలో స్వామి, అమ్మవార్ల చిత్రపటాలకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం వడలను భక్తులకు వడ్డించి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
వడల ప్రత్యేకత:
ఈ వడలను శనగపప్పు, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, సోంపు వంటి పదార్థాలతో రుచికరంగా తయారు చేస్తున్నారు. భక్తులు వడల రుచిపై సంతృప్తికరమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారని టీటీడీ వెల్లడించింది.
ప్రతి రోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అన్నప్రసాద కేంద్రంలో వడలు అందుబాటులో ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. భక్తులకు రుచికరమైన, నాణ్యమైన భోజనాన్ని అందించడమే లక్ష్యంగా టీటీడీ ఈ చర్యలు తీసుకుంటోందని చైర్మన్ నాయుడు అన్నారు. కొత్త పాలక మండలి ఏర్పడిన తర్వాత భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు అన్నప్రసాదంలో నాణ్యత పెంపుపై ప్రత్యేక దృష్టి సారించామని ఆయన తెలిపారు.
Also Read : TTD EO Shyamala Rao Interesting Update : అలిపిరి టోల్ గేట్ విస్తరణకు చర్యలు – ఈవో



















