హైదరాబాద్ | సాంకేతిక రంగంలో బిట్స్ పిలానీ విద్యార్థులు కీలకమైన పాత్ర పోషిస్తున్నారని స్పష్టం చేశారు తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ. బిట్స్ పిలానీకి చెందిన అత్యంత ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ‘బిట్సా గ్లోబల్ మీట్’ (BGM26) ఆరో ఎడిషన్ హైదరాబాద్‌లోని బిట్స్ (బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్) పిలానీ క్యాంపస్‌లో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఈ సదస్సును అధికారికంగా ప్రారంభించారు. గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ (FAC) , కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాల (LET&F) శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ , బీజీఎం 2026 ఛైర్‌పర్సన్ అనిత సాకూరు, బిట్స్ గ్రూప్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి. రామగోపాల్ రావు, ఇన్వెంటస్ క్యాపిటల్ పార్టనర్స్ ఎంజెల్ ఇన్వెస్టర్ కన్వల్ రేఖి , బీజీఎం 2026 చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మయూర్ పట్నాలా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ మాట్లాడారు. ప్రపంచ సాంకేతిక కేంద్రంగా భారత దేశ కీర్తిని స్థాపించడంలో బిట్స్ పిలానీ వంటి సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. స్టార్టప్‌లు, విద్యార్థుల నేతృత్వంలోని ప్రాజెక్టులు, పరిశ్రమల భాగస్వామ్యాలతో కూడిన బిట్స్ సంస్థలోని శక్తివంతమైన ఆవిష్కరణ, ఇంక్యుబేషన్ వ్యవస్థ, ఉన్నత విద్యా సంస్థలు జాతీయ ప్రాధాన్యతలకు , ప్రపంచ వాస్తవాలకు అనుగుణంగా తమను తాము ఎలా మలుచుకోవచ్చో నిరూపిస్తుందని ఆయన అన్నారు.
ఈ సందర్బంగా కీలక సూచనలు చేశారు గవర్నర్ వర్మ విద్యార్థులకు . దేశ భవిష్యత్తు అంతా మీ చేతుల్లోనే ఉందని చెప్పారు. ఏ ఒక్కరూ ఈ విలువైన సమయాన్ని దుర్వినియోగం చేయొద్దని సూచించారు.















