హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏపీ సర్కార్ కు చురకలు అంటించారు. ప్రతీసారి తాము మీతో పేచీలు పెట్టుకోవాలని అనుకోవడం లేదన్నారు తెలంగాణ రాష్ట్రానికి పంచాయితీ కావాలా లేక నీళ్లు కావాలా అని అడిగితే నేను నీళ్లే కావాలని కోరుకుంటానంటూ ప్రకటించారు. వివాదం కావాలా, లేక పరిష్కారం కావాలా అని అడిగితే పరిష్కారం కావాలని కోరుకుంటానని అన్నారు సీఎం. నీళ్ల వివాదం ముసుగులో రాజకీయ లబ్ది పొందాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదని స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా పరిష్కారం కోసం అందరూ సహకరించాలని పార్టీలను విజ్ఞప్తి చేస్తున్నానని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి.
మన సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుందామని ఆయన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సూచించారు. కృష్ణా నదిపై ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టుల అనుమతులకు సంబంధించి అడ్డంకులు పెట్టకండి అని కోరారు సీఎం. దీని కారణంగా తమకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావడం లేదంటూ వాపోయారు. ఆర్థిక భారం పడుతోందన్నారు. తాము వివాదం కోరుకోవడం లేదని, కేవలం పరిష్కారం మాత్రమే ఆశిస్తున్నామని చెప్పారు . రాజకీయ ప్రయోజనాలు కాదు ప్రజల ప్రయోజనాల కోసం, రైతుల ప్రయోజనాల కోసం ఆలోచిస్తున్నామని అన్నారు రేవంత్ రెడ్డి . తెలంగాణకు పోర్టు కనెక్టివిటీ రావాలంటే పక్క రాష్ట్రం సహకారం ఉండాలన్నారు. రెండు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు.















