తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా టీటీడీ చేసిన ఏర్పాట్లను టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముందుగా గోగర్భం డ్యామ్ సర్కిల్ వద్దకు చేరుకున్న చైర్మన్ భక్తుల కోసం ఏర్పాటు చేసిన క్యూలైన్లు, సదుపాయాలపై పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం శిలాతోరణం, కృష్ణతేజ విశ్రాంతి గృహాల వద్ద ఏర్పాటు చేసిన SSD టోకెన్ల తనిఖీ కేంద్రంలో తనిఖీ ప్రక్రియను పరిశీలించి భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో భక్తుల కోసం అన్ని ఏర్పాటు సిద్ధం చేయడం జరిగిందన్నారు. భక్తులందరికీ సౌకర్యవంతంగా దర్శనం కల్పించేందుకు ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. పోలీసులు, విజిలెన్స్, టీటీడీ యంత్రాంగం సమన్వయంతో ఇంటిగ్రేటెడ్ ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఎప్పటికప్పుడు భక్తుల రద్దీని పర్యవేక్షిస్తూ వైకుంఠ ద్వార దర్శనాలను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఈవో వెంట టీటీడీ బోర్డు సభ్యులు పనబాక లక్ష్మీ, నరేష్, సీవీఎస్వో మురళీకృష్ణ, తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.



















