విశాఖపట్నం జిల్లా : కోట్లాది మంది భక్తుల కొంగు బంగారంగా వినుతికెక్కింది విశాఖపట్నం జిల్లాలోని సింహాచాలం ఆలయం. మొన్నటికి మొన్న దక్షిణాఫ్రికాతో జరిగిన సీరీస్ లో సత్తా చాటాడు , సెంచరీలతో కదం తొక్కాడు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సైతం గుడిని దర్శించుకుని పూజలు చేశాడు. తాజాగా ఐసీసీ వన్డే వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత మహిళా క్రికెట్ జట్టు. ఈ సందర్భంగా అప్పన్న స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధన్నాతో పాటు
రేణుకా సింగ్, షఫాలీ వర్మ, అమర్‌ప్రీత్ కౌర్, వైష్ణవి శర్మ, క్రాంతి గౌడ్ , శ్రీ చరణి ఆలయ సందర్శనలో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా శ్రీలంకతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రెండో టీ20కి ముందు భారత మహిళల క్రికెట్ జట్టు విశాఖపట్నంలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించింది.
జట్టుతో పాటు అంపైర్లు డిఎస్ లక్ష్మి, బృందా రాఠీ కూడా ఆలయాన్ని సందర్శించారు. ఆలయ అధికారులు క్రీడాకారిణులకు సంప్రదాయ స్వాగతం పలికారు, సహాయ కార్యనిర్వహణాధికారి తిరుమలేశ్వర రావు, పర్యవేక్షణాధికారి కె వెంకటేశ్వర రావు జట్టుకు ఆచార బద్ధమైన గౌరవాలతో స్వాగతం పలికారు. క్రికెటర్లు మూలవిరాట్టుకు ప్రార్థనలు చేసి, గర్భగుడిలో ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు.
ఆలయ ప్రాంగణంలోని పవిత్ర కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అనంతరం వేద పండితులు క్రీడాకారిణులకు వేద ఆశీర్వాదాలు అందించారు. అనంతరం ఆలయ అధికారులు వారికి పట్టు వస్త్రాలు, ప్రసాదం అందించి సత్కరించారు. క్రీడాకారిణులు దేశానికి నిరంతర విజయం లభించాలని ఆకాంక్షించారు



















