హైదరాబాద్ : మనతో పాటు చుట్టు పక్కల ఉన్న వాళ్ల గురించి ఆలోచించినప్పుడే మన జీవితానికి సార్ధకత ఉంటుందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. పరుల కొరకు పాటుపడని నరుడి బతుకు దేనికని ప్రముఖ కవి సి. నారాయణ రెడ్డి తన గజల్స్‌లో చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇది మానవ జీవితం పరమార్థాన్ని, ఇతరుల కోసం జీవించడం ప్రాముఖ్యతను తెలియజేసే గొప్ప వాక్యమని దీనిని అందరూ ఒంట పట్టించుకోవాలని సూచించారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో తనతో పాటు చుట్టుపక్కల వారిని కూడా సురక్షితంగా కాపాడాలనే ఉద్దేశంతో శిక్షణ కార్యక్రమన్ని ఏర్పాటు చేశామనన్నారు. `యువ ఆపద మిత్ర` పథకం వాలంటీర్లకు హైడ్రా ఆధ్వర్యంలో ఫతుల్‌గూడలో వారం రోజుల పాటు ఏర్పాటు చేసిన శిక్షణను హైడ్రా కమిషనర్ ప్రారంభించి ప్రసంగించారు.
పరుల కోసం పాటుపడే ఆలోచనతో ఈ శిక్షణకు రావడం ఎంతో ఆనందించదగ్గ విషయమన్నారు ఏవీ రంగనాథ్. మన రెండు చేతుల్లో ఒకటి పరులకు చేయూతను అందించేందుకు ఉపయోగపడాలన్నారు. మనం జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవడం వరకే పరిమితం అవ్వకుండా ఇతరులకు కూడా చేయూతను అందించాలని సూచించారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తోటివారిని కాపాడడం ఎలా అనేది ఈ శిక్షణలో నేర్పుతారని చెప్పారు. మీకు కూడా మీ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులపై అవగాహన ఉండాలన్నారు. అప్పుడే ప్రమాద సమయంలో తోటివారిని కాపాడగలరన్నారు. వారం రోజుల శిక్షణలో అన్ని మెలుకువలు నేర్చుకుని.. వాటిని మరింత మందికి మీరు తెలియజేయాలని సూచించారు.
















