శబరిమల : కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవమైన శబరిమల అయ్యప్ప క్షేత్రంలో భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేసే లక్ష్యంతో భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ రెండు రోజుల పాటు శబరిమలలో పర్యటించారు. రాజకీయాలకు అతీతంగా, ఒక సామాన్య భక్తుడిగా ఆయన ఈ యాత్రను చేపట్టారు. పుంగనూరు నుండి రోడ్డు మార్గాన బయలుదేరిన రామచంద్ర యాదవ్ శబరిమల సన్నిధానం చేరుకున్నారు. ఈ సందర్భంగా పంబ నుండి పవిత్ర సన్నిధానం వరకు ఉన్న కష్టతరమైన నడక మార్గంలో భక్తులతో కలిసి ప్రయాణించారు. మార్గమధ్యంలో భక్తులతో సంభాషించారు. వారికి అందుతున్న వసతులు, బస, పారిశుధ్యం, వైద్య సదుపాయాల గురించి ఆరా తీశారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు పడుతున్న ఇబ్బందులను గమనించి చలించి పోయారు.
అనంతరం స్వామి వారి అభిషేక సేవలో పాల్గొన్నారు బోడె రామచంద్ర యాదవ్. తన భక్తిని చాటుకుంటూ స్వామివారికి వెండి దీపపు స్తంభాలను సమర్పించారు. శబరిమలలో నిరంతరం భక్తులకు సేవ చేస్తున్న ఆలయ సిబ్బంది సేవలను గుర్తించి, వారికి వెయ్యి టీ-షర్టులను అందజేసి తన సేవాభావాన్ని చాటుకున్నారు. పర్యటన అనంతరం, తాను క్షేత్రస్థాయిలో గుర్తించిన సమస్యలతో కూడిన ఒక సమగ్ర నివేదికను రూపొందించి, శబరిమల ఆలయ అధికారులకు వినతిపత్రం రూపంలో సమర్పించారు. భక్తులకు మెరుగైన వసతులు కల్పించాలని, ముఖ్యంగా పారిశుధ్య నిర్వహణ, వైద్య సదుపాయాలను పెంచాలని, నడకదారిలో విశ్రాంతి ప్రదేశాలను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.


















