SEBI Chairman : భారత స్టాక్ మార్కెట్‌లో అక్రమాలకు ఎంత మాత్రం తావుండదని, అలాంటి చర్యలపై కఠినంగా వ్యవహరిస్తామని సెబీ (భారత మార్కెట్ నియంత్రణ సంస్థ) చైర్మన్ తుహిన్ కాంత పాండే (Tuhin Kanta Pandey) తేల్చి చెప్పారు. మార్కెట్‌పై నిఘాను మరింత పెంచామని, ఈ ప్రక్రియలో స్టాక్ ఎక్స్ఛేంజీల భాగస్వామ్యం కూడా కీలకంగా ఉందన్నారు.
SEBI Chairman Shocking Comments
శనివారం ముంబయిలో బాంబే చార్టర్డ్ అకౌంటెంట్స్ సొసైటీ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మార్కెట్‌లో జరుగుతున్న అభివృద్ధులపై, విదేశీ సంస్థల ట్రేడింగ్‌పై ఏర్పడిన చర్చల మధ్య పాండే చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఇటీవల సెబీ, డెరివేటివ్ ట్రేడింగ్‌లో నిబంధనలకు విరుద్ధంగా భారీ లాభాలు ఆర్జించిన అమెరికా ట్రేడింగ్ సంస్థ జేన్ స్ట్రీట్ గ్రూప్‌పై నిషేధం విధించిన విషయం తెలిసిందే. సెబీ శుక్రవారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో, మార్కెట్‌ను మోసపూరితంగా వినియోగించినందుకు ఆ సంస్థపై కఠిన చర్యలు తీసుకుంది.
ఈ నేపథ్యంలో ఇతర విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) కూడా జేన్ స్ట్రీట్ తరహాలో వ్యూహాలు అనుసరిస్తున్నారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, ‘‘మేము ఎలాంటి అక్రమాలను సహించము. మార్కెట్ పద్ధతులకు వ్యతిరేకంగా జరిగే కార్యకలాపాలపై చట్టపరమైన చర్యలు తప్పవు,’’ అని పాండే స్పష్టం చేశారు.
సెబీ చర్యలు, వ్యాఖ్యల వల్ల విదేశీ పెట్టుబడిదారుల ట్రేడింగ్‌పై నిఘా పెరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయ సంస్థలు భారత మార్కెట్‌ను గౌరవిస్తూ, నిబంధనల మేరకు వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన హితవు పలికారు.
Also Read : Today Gold and Silver Price : నేడు స్థిరంగా ఉన్న పసిడి ధరలు



















