హైదరాబాద్ : తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన కామెంట్స్ చేశారు. రాష్ట్ర ప్రజలు అవకాశం ఇస్తే ముఖ్యమంత్రిని అవుతానని అన్నారు. ఓ ఛానల్ తో ఆమె చిట్ చాట్ చేశారు.
గులాబీ పార్టీ పెట్టినప్పుడు అందరూ అలానే అన్నారని, తనను కూడా అలానే అంటున్నారని చెప్పారు కవిత. ప్రజలు ఆశీర్వదిస్తే తెలంగాణకు మొదటి మహిళ ముఖ్యమంత్రి అవుతానని ధీమా వ్యక్తం చేశారు. వాళ్లకు పవర్ షేర్ చేసుకోవడం ఇష్టం లేదన్నారు. ఆమె పలువురు సీనియర్ నేతల గురించి మరోసారి షాకింగ్ కామెంట్స్ చేయడం కలకలం రేపింది. తాను ఏనాడూ ఎవరికీ ప్రయారిటీ ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. తమ జాగృతి కార్యకర్తలు ఏది అడిగినా తాను చేశానే తప్పా పవర్ లో ఉన్న సమయంలో ఈ పని చేసి పెట్టమని ఏనాడూ కోరిన దాఖలాలు లేవన్నారు.
తెలంగాణ కాన్సెప్ట్ తో కనెక్ట్ కావడంపైనే ఎక్కువగా దృష్టి సారించడం జరిగిందని చెప్పారు కల్వకుంట్ల కవిత. 10 సంవత్సరాల కాలంలో ఎన్నో సమస్యల గురించి ప్రస్తావించానని తెలిపారు. ప్రసంగాలు చేయడం వల్ల పనులు కావన్నారు. వ్యవస్థలను బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టమని సూచించానని చెప్పారు. కానీ తన ప్రమేయాన్ని వారు జీర్ణించుకోలేక పోయారని మండిపడ్డారు కవిత. తన తండ్రి కేసీఆర్ కు చెప్పడంలో ఏనాడూ భయానికి గురి కాలేదన్నారు. ప్రోటోకాల్ అనే పేరుతో తనను ఇతర నియోజకవర్గాలకు వెళ్లకుండా అడ్డుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు. తమకు ఐడీపీఎల్ భూములతో ఎలాంటి సంబంధం లేదన్నారు. అందుకే ఎమ్మెల్యేలు కృష్ణారావు, మహేశ్వర్ రెడ్డిలకు లీగల్ నోటీసులు ఇవ్వడం జరిగిందని చెప్పారు.
















