అమరావతి : ఈ నెల 24వ తేదీ నుంచి 28వ తేదీ వరకు విజయవాడలో జరిగే యోనెక్స్–సన్‌రైజ్ 87వ సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్–2025 పోస్టర్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో ఆవిష్కరించారు. ఈ ఛాంపియన్‌షిప్ పోటీలను ప్రారంభించాల్సిందిగా రాష్ట్ర క్రీడాశాఖా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, శాప్ ఛైర్మన్ రవి నాయుడు సీఎం ను ఆహ్వానించారు. ఈ టోర్నమెంట్ విజయవంతంగా నిర్వహించేందుకు క్రీడా శాఖ, మున్సిపాలిటీ, శాప్ విభాగాలు ఏర్పాట్లు చేస్తున్నాయని సీఎంకు వివరించారు.
ఏపీలో పదేళ్ల తర్వాత మళ్లీ ఈ ఛాంపియన్‌షిప్ నిర్వహిస్తున్నామని తెలిపారు. బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌కు సంబంధించి జాతీయ స్థాయి క్రీడాకారుల వివరాలు సీఎం చంద్రబాబు నాయుడుకు తెలిపారు. ఈ సందర్బంగా టోర్నమెంటను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని సీఎం సూచించారు. సీఎంను కలిసిన వారిలో విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ అంకమ్మ చౌదరి కూడా ఉన్నారు.
ఈ సందర్బంగా మరికొన్ని కీలక సూచనలు చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ప్రభుత్వం క్రీడా రంగానికి పెద్ద ఎత్తున నిధులు సమకూరుస్తోందన్నారు. అంతే కాకుండా ప్రతిభ కనపర్చేందుకు గాను క్రీడాకారులకు మెరుగైన వసతి సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ 2025 పోటీలలో పాల్గొనేందుకు వచ్చే క్రీడాకారులకు మరిచి పోలేని విధంగా సౌకర్యాలు కల్పించాలన్నారు సీఎం.



















