చెన్నై : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రస్తుతం సనాతన హిందూ ధర్మ పరిరక్షకుడిగా అవతారం ఎత్తారు. దీంతో ఆయా హిందూ సంస్థలు, మఠాలు, పీఠాధిపతులు పెద్ద ఎత్తున తనకు మద్దతుగా నిలిచారు. చివరకు సన్మానాలు కూడా చేస్తున్నారు. ఈ సందర్బంగా కర్ణాటక రాష్ట్రంలోని ఉడుపి క్షేత్రంలో నిర్వహించిన బృహత్ గీతోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనను ఘనంగా సన్మానించారు పుట్టిగే శ్రీకృష్ణ మఠం మఠాధిపతి పరమ శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ప్రతీ హిందువులో చైతన్యం రావాల్సిన అవసరం ఉందన్నారు.
తమిళనాడులో మన ధర్మాన్ని మనం అనుసరించడం కోసం న్యాయ పోరాటాలు చేయాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండేందుకు హిందు బంధవులు ప్రయత్నం చేయాలన్నారు పవన్ కళ్యాణ్. సనాతన ధర్మం మూఢనమ్మకం కాదని, అది అద్భుతమైన ఆధ్యాత్మిక శాస్త్రం అని అన్నారు. భగవద్గీత ప్రాంతాలకో, మతాలకో ఉద్దేశించిన గ్రంథం కాదన్నారు. భగవద్గత మనో ధైర్యమిచ్చే గురువు, నిర్దేశించే దిక్సూచి అని స్పష్టం చేశారు. పుట్టిగె మఠం చేస్తున్నది ఆధ్యాత్మిక ప్రక్రియ కాదని, సాంస్కృతిక సర్వతోముఖాభివృద్ది కోసమన్నారు.



















