వరంగల్ జిల్లా : బీసీలకు ఇప్పటికే ప్రకటించిన విధంగా 42 శాతం రిజర్వేషన్లు చట్ట బద్దంగా కల్పించాలని డిమాండ్ చేశారు బీసీ జేఏసీ కో చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్. మంగళవారం వరంగల్ జిల్లా హన్మకొండలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లపై పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ ప్రైవేట్ బిల్లును ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. బీజేపీకి బీసీలపై చిత్తశుద్ధి ఉంటే ప్రవేట్ బిల్లుకు మద్దతు ఇవ్వాలన్నారు. బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించే బాధ్యత బిజెపి, కాంగ్రెస్ పార్టీలదేనని స్పష్టం చేశారు జాజుల శ్రీనివాస్ గౌడ్. అడిగే బాధ్యత రాహుల్ గాంధీ అయితే, చేయాల్సిన బాధ్యత మోడీ తీసుకోవాలని అన్నారు.
ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశాలలో బీసీ బిల్లు పై చర్చించకుంటే పార్లమెంటు సభ్యుల ఇండ్లను ముట్టడిస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అఖిలపక్షం తో సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదితో భేటీ కావాలని అన్నారు. రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో మిత్రులందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి 59 సార్లు ఢిల్లీకి వెళ్లారు, ఇక 60వ సారి బీసీల కోసం ఢిల్లీకి వెళ్లాలని సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ లు తగ్గించి బీసీలను మోసం చేసిన ఘనత కాంగ్రెస్, బిజెపిలదేనని సంచలన ఆరోపణలు చేశారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఈనెల 9వ తేదీన పార్లమెంటును ముట్టడిస్థామని ప్రకటించారు జాజుల శ్రీనివాస్ గౌడ్.















