అమరావతి : ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ సందర్బంగా కొత్త జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. పరిపాలనలో పారదర్శకత తీసుకు వచ్చేందుకు ఇది ఉపయోగ పడుతుందని పేర్కొంది. విశాఖ, అమరావతి, రాయలసీమ కేంద్రాలుగా మూడు ప్రధాన జోన్లను ప్రకటించింది. ఆయా జిల్లాలను విభజించడం కేవలం పరిపాలనా పునర్వ్యవస్థీకరణ కోసం కాకుండా సమగ్ర అభివృద్ధి కోసం బ్లూప్రింట్ రూపొందించింది. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక ఆసియాలోని రెండు విజయ వంతమైన నమూనాలను తీసుకుంది సర్కార్. ఈ ప్రణాళికలో సింగపూర్ భాగస్వామ్యం, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి, పారదర్శక పాలన, అవినీతి రహిత వ్యవస్థ వైపు అడుగులు వేయడానికి మార్గనిర్దేశం చేస్తుంది.
1978లో డెంగ్ జియావోపింగ్ సింగపూర్‌ను సందర్శించిన తర్వాతే చైనాలో ప్రత్యేక ఆర్థిక మండళ్లు (SEZలు) ఎగుమతి ఆధారిత పారిశ్రామికీకరణ ప్రారంభమైంది. సింగపూర్ నుండి నేర్చుకున్న సమర్థవంతమైన పట్టణ ప్రణాళిక చైనాను కేవలం దశాబ్దాల కాలంలో రెండో అతిపెద్ద ప్రపంచ ఆర్థిక శక్తిగా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించింది. అదే సంస్కరణల స్ఫూర్తిని స్థానిక అవసరాలకు అనుగుణంగా మార్చుకుని, మూడు జోన్ల ద్వారా సమతుల్య అభివృద్ధి సాధించడం లక్ష్యంగా పెట్టుకుంది ఏపీ కూటమి ప్రభుత్వం. కొత్త జోనల్ వ్యవస్థ ద్వారా, ప్రతి ప్రాంతం ప్రత్యేకత, బలం ఆధారంగా అభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించారు.
విశాఖ జోన్ ను తీర ప్రాంత వృద్ధి కేంద్రంగా ఏర్పాటు చేసింది. పోర్ట్ ఆధారిత వృద్ధి, భారీ పారిశ్రామిక అభివృద్ది సాధించడం, అంతర్జాతీయ వాణిజ్యం, లాజిస్టిక్స్‌లో ఏపీని కీలక కేంద్రంగా మార్చడం. పాలనా , నాలెడ్జ్ హబ్ గా అమరావతి జోన్ ను ఏర్పాటు చేసింది. పాలనా వ్యవస్థలో వేగం, సాంకేతికత , అంతర్జాతీయ విద్యా ప్రమాణాలను స్థాపించడం. సాంకేతిక , ఉత్పాదక వేదికగా రాయలసీమ జోన్ ను ఏర్పాటు చేసింది సర్కార్. వ్యవసాయ ఆధారిత పారిశ్రామిక రంగం, సాంకేతిక అవకాశాల వేదికగా మార్చనుంది. ప్రాంతీయ అసమానతలను తగ్గించి, వినూత్న పరిశ్రమలకు గమ్యస్థానంగా మార్చడం అంతిమ లక్ష్యంగా పెట్టుకుంది.















