హైదరాబాద్ : కాంగ్రెస్ సర్కార్ పై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి హరీశ్ రావు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందన్నారు. బసవేశ్వర, సంగమేశ్వర ప్రాజెక్టులను పక్కన బెడితే ఊరుకోం అని వార్నింగ్ ఇచ్చారు.
పనులు వెంటనే మొదలు పెట్టక పోతే రైతుల పక్షాన పాదయాత్ర చేపడుతామన్నారు. యాసంగిలో సగం మంది రైతులకు రైతు బంధు కోత , సాగు చేసిన భూమికే అనే సాకుతో 70 లక్షల ఎకరాలకు ఎసరు పెట్టారంటూ ఆరోపించారు. పత్తి, చెరుకు, తోటల రైతులకు ఇక ఏడాదికి ఒకసారి మాత్రమే రైతుబంధు ఇచ్చే కుట్రను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. సోయా, మొక్కజొన్నలు కొనుగోలు చేసి 48 రోజులు దాటినా చిల్లిగవ్వ ఇవ్వలేదని మండిపడ్డారు హరీశ్ రావు.
ఓట్ల కోసమే చీరల పంపిణీ చేశారని, అవి చీరల్లా లేవు యూనిఫామ్ లా ఉన్నాయంటూ ఎద్దేవా చేశారు. మహిళలకు రెండేళ్ల బకాయి రూ. 60 వేలు చెల్లించాకే సారె పెట్టాలని డిమాండ్ చేశారు. చేతల ప్రభుత్వం బీఆర్ఎస్ అయితే పూర్తిగా చెత్త సర్కార్ కాంగ్రెస్ అంటూ మండిపడ్్డారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించకపోతే రైతుబంధు పథకం పూర్తిగా బంద్ కావడం ఖాయం అని హెచ్చరించారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో పర్యటన సందర్భంగా మీడియాతో మాట్లాడారు హరీశ్ రావు. అబద్దపు హామీలతో పవర్ లోకి వచ్చిన సర్కార్ పూర్తిగా రైతులను విస్మరించిందని ఆరోపించారు. వారు నానా ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు.

















