KTR : హైదరాబాద్ : జగిత్యాల జిల్లా లోని కొండగట్టు అగ్నిప్రమాద ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అభయాంజనేయ స్వామి ఆలయ పరిసరాల్లో అర్ధరాత్రి జరిగిన ఘోర అగ్నిప్రమాదం జరగడానికి కారణం సర్కార్ నిర్లక్ష్య వైఖరేనని పేర్కొన్నారు. ప్రమాద ఘటనపై చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. క్షేత్రస్థాయిలో జరిగిన నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధి కోసం అప్పులు చేసి, ఎంతో కష్టపడి దుకాణాలు పెట్టుకున్న పేద, మధ్యతరగతి కుటుంబాలు ఈ ప్రమాదంతో ఒక్కసారిగా రోడ్డున పడ్డాయని కేటీఆర్ (KTR) ఆవేదన చెందారు. షాపుల్లో ఉన్న సరుకు, బొమ్మలు, ఇతర సామాగ్రి సర్వం అగ్నికి ఆహుతయ్యాయని, దాదాపు 30 కుటుంబాల భవిష్యత్తు నాశనం అయిందని విచారం వ్యక్తం చేశారు. సుమారు కోటి రూపాయల వరకు ఆస్తి నష్టం జరగడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
KTR Shocking Comments on Telangana Govt
సకాలంలో ఫైర్ ఇంజన్లు రాక పోవడమే ఆస్తి నష్టం ఇంత భారీగా పెరగడానికి ప్రధాన కారణమని కేటీఆర్ మండిపడ్డారు. జగిత్యాల ఫైర్ ఇంజన్ రిపేర్‌లో ఉండటం, వచ్చిన ఒక ఇంజన్ పని చేయక పోవడం, గంట తర్వాత కోరుట్ల, కరీంనగర్ నుంచి వాహనాలు రావడం ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యానికి, నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. ఈ వైఫల్యానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. సర్వం కోల్పోయిన ఈ కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. జరిగిన ఆస్తి నష్టం, పూర్తిగా దెబ్బతిన్న వ్యాపారాన్ని, దుకాణాలు ఏమాత్రం పనికిరాని స్థితికి చేరడాన్ని దృష్టిలో ఉంచుకొని, మానవతా దృక్పథంతో ఒక్కో కుటుంబానికి రూ. 30 లక్షల ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Also Read : DK Shivakumar Shocking Comments : డీకే శివకుమార్ షాకింగ్ కామెంట్స్
















