Minister Savitha : అమరావతి : ఒకే చోట ఆప్కో, లేపాక్షి, జీసీసీ ఉత్పత్తులను విక్రయించేలా చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత (Minister Savitha) వెల్లడించారు. దీనిలో భాగంగా ఆప్కో, లేపాక్షి, అరకు కాఫీతో కూడిన జీసీసీ ఉత్పత్తుల వాణిజ్య సముదాయాన్ని ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. ఇటువంటి వాణిజ్య సముదాయాలను తొలి విడతగా దేశంలోని అయిదు ప్రధాన నగరాల్లో ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. దీనిలో భాగంగా ఏపీలో మూడు చోట్ల నెలకొల్పనున్నట్లు వెల్లడించారు.
రాబోయే ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని తిరుపతిలో వచ్చే నెల 20 నుంచి చేనేత, హస్త కళల ఎగ్జిబిషన్ ను నిర్వహించనున్నామన్నారు. దేశ వ్యాప్త లేపాక్షి వారోత్సవాల్లో భాగంగా ఏపీలో వచ్చే నెల ఎనిమిదో తేదీ నుంచి 14వ తేదీ వరకూ వారోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. విజయవాడలోని ఓ హోటల్ లో ఏపీ చేనేత, హస్తకళల అభివృద్ధి గౌరవ సలహాదారు సుచిత్ర ఎల్లా, రాష్ట్ర చేనేత, జౌళి శాఖ ముఖ్య ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా, కమిషనర్ రేఖారాణి, లేపాక్షి ఎండీ విశ్వతో రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత సమీక్షా సమావేశం నిర్వహించారు.
Minister Savitha Comments
చేనేతలకు, హస్త కళాకారులకు, గిరిజనులకు ఆర్థిక భరోసాతో కూడిన జీవనం అందించడమే సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి లక్ష్యమన్నారు. దీనిలో భాగంగా చేనేత, హస్త కళలు, అరకు కాఫీతో కూడిన జీసీసీ ఉత్పత్తులు ఒకే వాణిజ్య సముదాయంలో లభ్యమయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారని తెలిపారు మంత్రి ఎస్. సవిత. దీనిలో భాగంగా చేనేత, హస్త కళారూపాలు, అరకు కాఫీతో పాటు జీసీసీ ఉత్పత్తులు ఒకేచోట లభ్యమయ్యేలా వాణిజ్య సముదాయాలు ఏర్పాటు చేయనున్నామన్నారు. తొలి విడతగా దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, హైదరాబారాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలో ఇటువంటి వాణిజ్య సముదాయాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుంటున్నట్లు వెల్లడించారు. ఇందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని మంత్రి ఆదేశించారు.
Also Read : Hydraa Commission Important Update : కబ్జాదారులపై కొరడా బాధితులకు భరోసా

















