Radhakrishnan : అమరావతి : రాష్ట్ర విభజన తర్వాత ఏపీ అనేక ఇబ్బందులు ఎదుర్కొందని అయితే ప్రసుతం ఏపీలో వ్యాపారానికి ప్రశాంతమైన వాతావరణం నెలకొందని ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ (Radhakrishnan) అన్నారు. సరైన సమయంలో సరైన ఆలోచనే విజయానికి పునాది అని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తోనే పెట్టుబడులు వస్తాయని ఉప రాష్ట్రపతి చెప్పారు. శుక్రవారం విశాఖ ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో భారత పరిశ్రమల సమాఖ్యతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సదస్సును రాధాకృష్ణన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మోదీ పాలనలో 11 ఏళ్లుగా దేశం ముందుకు వెళుతోందని , వికసిత్ భారత్ ట్రాక్‌పై మనదేశం పరుగులు పెట్టాలని ఉప రాష్ట్రపతి ఆకాంక్షించారు. అన్ని దేశాలతో స్నేహం కోరుకుంటామని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటామని చెప్పారు. విశాఖ..మరిన్ని మైలురాళ్లు అధిగమించాలని కోరుకుంటున్నానని, మూడు దశాబ్దాలుగా చంద్రబాబు తనకు స్నేహితుడు అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.
Vice President Radhakrishnan Comments
దేశంలో పేదరికం తగ్గించేందుకు కేంద్రం అనేక చర్యలు చేపడుతోందని అన్నారు. వ్యాపార అనుకూల రాష్ట్రంగా ఏపీ నిలిచిందన్నారు. ఏపీలో వ్యాపారానికి ప్రశాంతమైన వాతావరణం ఉందని, చంద్రబాబు సారథ్యంలో ఏపీకి అనేక పెట్టుబడులు వచ్చాయన్నారు. పెట్టుబడిదారులను ఆకర్షించే విషయంలో తను ముందుంటారని, ప్రపంచ నలుమూలల నుంచి వచ్చి ఏపీలో పెట్టుబడి పెడుతున్నారని ఉదహరించారు. లక్ష్యం పెట్టుకోవడం సులువు అని, అక్కడికి చేరుకోవడమే కష్టం అని ఉపరాష్ట్రపతి (Radhakrishnan) వివరించారు. కార్మిక చట్టాలు, పన్నుల్లో కేంద్రం అనేక సంస్కరణలు తెచ్చిందని తెలిపారు. మోదీ హయాంలో వికసిత్ భారత్ దిశగా దూసుకెళ్తున్నామని, చంద్రబాబు స్వప్నం సాకారం కావాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కోరారు. ఏపీకి పెట్టుబడులు తెచ్చేందుకు మంత్రి లోకేష్ కృషి చేస్తున్నారని, ఏపీ ఎగుమతులు, దిగుమతులకు విశాఖ.. గేట్‌వేగా మారిందన్నారు. స్వర్ణాంధ్ర కావాలన్న చంద్రబాబు స్వప్నం సాకారం కావాలని ఆకాంక్షించారు. వసుధైక కుటుంబం, మానవతా విలువలను భారత్ ఎప్పటికీ మరిచి పోదన్నారు. సాంకేతికత ద్వారా అభివృద్ధి వైపు అడుగులు వేస్తామని పీయూష్ గోయల్ స్పష్టం చేశారు.
Also Read : TTD AEO Clear Instructions : నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలి : ఏఈవో


















