Pawan Kalyan : అమరావతి : పల్లె ప్రజలకు నాణ్యతతో కూడిన స్వచ్ఛమైన తాగునీటి సరఫరా, గుంతలు లేని రహదారులు అందుబాటులో ఉంచాలన్నదే తన ముందున్న ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్పష్టం చేశారు. తన ప్రతి అడుగూ ఆ దిశగానే ఉంటాయని అన్నారు. జల్ జీవన్ మిషన్, పల్లె పండగ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పక్కాగా పాటించాలని స్పష్టం చేశారు. పల్లె రోడ్ల సమాచారం ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో త్వరలో సరికొత్త సాంకేతికతను ఆవిష్కరించ బోతున్నట్టు తెలిపారు. ‘జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టం’ ద్వారా గ్రామీణ రోడ్ల పూర్తి సమాచారాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకునే సాంకేతికతను అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపారు.
DY CM Pawan Kalyan Comments
సాస్కీ నిధుల సాయంతో పల్లె పండగ 2.0ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పల్లె పండగ 2.0, అడవి తల్లి బాట పనుల పురోగతి, జల్ జీవన్ మిషన్, స్వమిత్ర పథకాలపై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ, గ్రామీణ నీటి పారుదల శాఖ, ఇంజినీరింగ్ విభాగం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నిధులు అందుబాటులో ఉన్నా పనుల్లో ఆశించిన స్థాయిలో పురోగతి లేక పోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. అడవి తల్లిబాట, జల్ జీవన్ మిషన్ పనులు వేగవంతంగా పూర్తి చేసేలా తక్షణం ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ప్రతి పనిని నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేసేలా ఈ ప్రణాళికలు ఉండాలన్నారు. ఈ మేరకు యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సాస్కి నిధులకు అనుమతుల స్టేటస్ గురించి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులను ప్రశ్నించారు.
Also Read : Vinod Kumar Shocking Comments on EC : ఈసీ పక్షపాత వైఖరిని ప్రదర్శిస్తోంది – వినోద్ కుమార్


















