Bathukamma : ఆస్ట్రేలియా : తెలంగాణ సంప్రదాయాలు, సంస్కృతి ఉట్టిపడేలా ఆస్ట్రేలియా దేశంలో బతుకమ్మ సంబరాలు వైభవోపేతంగా జరిగాయి. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ క్వీన్స్ ల్యాండ్ ఆధ్వర్యంలో బ్రిస్ బేన్ నగరంలో జరిగిన ఈ వేడుకలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, తెలంగాణ అసెంబ్లీ మీడియా అడ్వయిజరీ కమిటీ చైర్మన్ ఐరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అక్కడ నివసిస్తున్న తెలంగాణ వాసులే కాకుండా ఇతర ప్రవాస భారతీయులు వేడుకలకు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
Bathukamma Celebrations in Australia
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ సప్త సముద్రాలు దాటి ఇతర దేశానికి వచ్చి నివసిస్తున్నా కూడా తెలంగాణ సంప్రదాయాలను పాటిస్తుండడం సంతోషంగా ఉందని తెలిపారు. బతుకమ్మ (Bathukamma) ఖ్యాతి ఖండాంతరాలు దాటడం తెలంగాణ సంస్కృతికి ఎంతో గర్వకారణమన్నారు. బతుకమ్మ, బోనాలతో పాటు ఇతర తెలంగాణ పండగలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని వివరించారు. తెలంగాణ సంస్కృతిని పరిరక్షించడానికి అనేక చర్యలు తీసుకుంటున్నారని, బతుకమ్మ వంటి పండగల కోసం ప్రత్యేకంగా నిధులు విడుదల చేశారని పేర్కొన్నారు.
చైర్మన్ ఐరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రాచీన సంస్కృతికి తెలంగాణ నిలయమని, అందులో నుంచి పుట్టుకొచ్చిన బతుకమ్మ వంటి వేడుకలకు ప్రపంచంలోనే తెలంగాణకు ప్రత్యేకమని తెలిపారు. అలాంటి ప్రత్యేక గుర్తుపు కలిగిన బతుకమ్మ వేడుకలను ఆస్ట్రేలియా వంటి దేశంలో ఘనంగా నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు. ప్రపంచంలోని ప్రతీ ప్రాంతానికి తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు పరిచయం కావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ఈ సంబరాల్లో తెలంగాణ అసోసియేషన్ ఆప్ క్వీన్స్ ల్యాండ్ అధ్యక్షుడు నరేందర్ కుమార్ చొల్లూరి, ఉపాధ్యక్షుడు మాధవ రెడ్డి గుర్రం, కార్యదర్శి దయాకర్ బచ్చు, అసోసియేషన్ ప్రతినిధులు ఉమేశ్ వంగపల్లి, సంతోష్ రావు ఏకే, విజయ నల్ల, శ్రీకళా రూపిరెడ్డి, ప్రియాంక కర్క, విజయ్ కోరబోయిన, ప్రేమలత వాసాల, విరించి రెడ్డి ఎక్కంటి, హరిత తన్నీరు, తదితరులు పాల్గొన్నారు.
Also Read : Sudha Reddy – Pink Power Run Growth : పింక్ పవర్ రన్ ను విదేశాలకు విస్తరిస్తాం – సుధా రెడ్డి
















