CM Revanth Reddy : హైదరాబాద్ : భారీ వర్షాలు హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా కుండ పోతగా కురుస్తున్నాయి. మూసీ నది గేట్లు ఎత్తడంతో మూసారాంబాగ్, ఎంజీబీఎస్, ఛాదర్ ఘట్ ప్రాంతాలన్నీ నీళ్లతో నిండి పోయాయి. పరిస్థితి దారుణంగా ఉంది. ట్రాఫిక్ జామ్ అయ్యింది. వరుసగా వర్షాలు, వరదలతో జంట జలాశయాల గేట్లు ఎత్తడం, మూసీ కి వరద నీటి ప్రవాహం పెరగటంతో మూసీ పరివాహకం వెంట ఉన్న పరిస్థితిని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారులను అడిగి తెలుసుకున్నారు. మూసీ వెంట లోతట్టు ప్రాంతాలన్నింటా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. అవసరమైన చోట పునరావాసం కల్పించేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు.
CM Revanth Reddy Meeting
అర్ధరాత్రి ఇమ్లిబన్ సమీపంలో ఎంజీబీఎస్ బస్టాండ్ చుట్టూ నీళ్లు రావటంతో అక్కడున్న ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకు వచ్చేందుకు చేపట్టిన సహాయక చర్యలను సీఎం స్వయంగా సమీక్షించారు. ఎప్పటికప్పుడు అధికారులతో ఫోన్లో మాట్లాడి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడి నుంచి బయటకు తీసుకు వచ్చే ఏర్పాట్లు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి ఎంజీబీఎస్ కు వచ్చే బస్సులను ప్రత్యామ్నాయ రూట్లకు మళ్లించాలని సూచించారు. బతుకమ్మ, దసరా పండుగల వేళ కావటంతో వివిధ జిల్లాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఆర్టీసీ విభాగం తగిన చర్యలు చేపట్టాలన్నారు.
వరుసగా రెండో రోజు కూడా హైదరాబాద్లో భారీ వర్ష సూచన ఉండటంతో పోలీస్, ట్రాఫిక్ హైడ్రా, జీ ఎచ్ ఎంసీ, విద్యుత్తు విభాగాలన్నీ అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. అన్ని విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. సిటీలో నీళ్లు నిలిచే ప్రాంతాలు, మూసీ ప్రమాదకరంగా ప్రవహించే ప్రాంతాల్లో అధికారులు ప్రజలను హెచ్చరించేలా బోర్డులు పెట్టాలని, అటు వైపు వాహనాలు, ప్రజలు వెళ్లకుండా దారి మళ్లించాలని సూచించారు.
Also Read : AP Heavy Rains Warning : పోటెత్తిన వర్షం జనజీవనం అస్తవ్యస్తం


















