Silver : దేశీయంగా వెండి ధరలు చరిత్రలో ఎప్పుడూ లేనంత స్థాయికి చేరాయి. బంగారంతో పాటు వెండి కూడా అమాంతం ఎగబాకి సామాన్య వినియోగదారులకు అందనంత దూరంలోకి వెళ్ళింది. గురువారం ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి (Silver) ధర రూ.1,000 పెరిగి జీవితకాల గరిష్ఠమైన రూ.1.40 లక్షలకు చేరుకుంది. హైదరాబాద్ మార్కెట్లో ఇప్పటికే కిలో వెండి రూ.1.50 లక్షల స్థాయిని తాకింది.
Silver Price Updates
ఫ్యూచర్స్ మార్కెట్లోనూ వెండి (Silver) కొత్త రికార్డు నమోదు చేసింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో డిసెంబర్ డెలివరీ కాంట్రాక్టు ధర రూ.3,528 (2.63%) పెరిగి రూ.1,37,530కి చేరింది. అలాగే 2026 మార్చి డెలివరీ కాంట్రాక్టు రూ.3,431 (2.53%) పెరిగి రూ.1,38,847 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా ఒక దశలో ఔన్స్ వెండి ధర 45 డాలర్లకు పైగా ఎగబాకి ఆల్‌టైమ్ హై రికార్డు సృష్టించింది.
ఈ ఏడాదిలో వెండి ధరల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. గత ఏడాది చివర్లో ఢిల్లీలో కిలో వెండి ధర రూ.89,700గా ఉండగా, ఈ ఏడాదిలో ఇప్పటివరకు రూ.50,300 పెరిగి 56 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఒక్క ఏడాదిలో వెండి ధరలు 50 శాతం పైగా పెరగడం ఇదే తొలిసారి. గడచిన పదేళ్లలో ఇది అత్యధిక వార్షిక పెరుగుదలగా నిలిచింది.
నిపుణుల విశ్లేషణ ప్రకారం, అమెరికా విధించిన సుంకాల కారణంగా అంతర్జాతీయ వాణిజ్యంలో అనిశ్చితి పెరగడం, ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గడంతో డాలర్, అమెరికా బాండ్ల రాబడులు పడిపోవడం, పారిశ్రామిక రంగాల్లో వెండి వినియోగం పెరగడం ప్రధాన కారణాలుగా పేర్కొంటున్నారు. అదనంగా దేశీయంగా పండుగ సీజన్‌లో డిమాండ్ పెరగడం, రూపాయి క్షీణత కూడా ధరల పెరుగుదలపై ప్రభావం చూపుతున్నాయి.
గత పది ఏళ్ల వెండి ధరల గణాంకాలను పరిశీలిస్తే, 2016లో కిలో వెండి ధర రూ.39,930గా ఉండగా, 2020లో అది రూ.67,383కి చేరింది. 2025లో ఇప్పటివరకు రూ.1.40 లక్షల స్థాయికి చేరి రికార్డు సృష్టించింది. ఈ క్రమంలో పెట్టుబడిదారులు, వినియోగదారులు కొనుగోలు ముందు ప్రస్తుత మార్కెట్ రేట్లను జాగ్రత్తగా పరిశీలించడం అవసరమని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
Also Read : Today Gold Price : నేడు కూడా స్వల్ప తగ్గుదలతో నడుస్తున్న పసిడి ధరలు


















